Begin typing your search above and press return to search.

మైనింగ్ కేసులో మాజీ సీఎంకు క్లీన్ చిట్‌

By:  Tupaki Desk   |   26 Oct 2016 9:32 AM GMT
మైనింగ్ కేసులో మాజీ సీఎంకు క్లీన్ చిట్‌
X
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ అధికారంలోకి వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి నెమ్మ‌ది నెమ్మ‌దిగా ఆ పార్టీకి చెందిన అతిర‌థ మ‌హార‌థుల‌పై న‌మోదైన కీల‌క కేసుల‌న్నీ కోర్టుల్లో వీగిపోతున్నాయి! ఇది యాదృచ్ఛిక‌మో.. లేదా ఏదైనా మ‌త‌ల‌బు ఉందో తెలీదు కానీ... ప‌రిస్థితి మాత్రం అలానే క‌నిపిస్తోంద‌నే వాద‌న‌లు వ‌స్తున్నాయి. గ్యాంగ్‌స్ట‌ర్ సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంట‌ర్ కేసులో పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న ప్ర‌స్తుత బీజేపీ క‌మ‌ల ద‌ళాధిప‌తి, ఎంపీ అమిత్ షాపై ఎన్‌డీఏ అధికారంలోకి వ‌చ్చిన కొద్ది కాలంలోనే ఆ కేసు నీరుగారి పోయింది. అస‌లు ఆ కేసుకి, అమిత్ కి సంబంధం ఏంట‌ని కూడా కోర్టు ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే.

ఇక‌, ఇప్పుడు క‌ర్ణాట‌క మాజీ సీఎం య‌డ్యూర‌ప్ప విష‌యంలోనూ కోర్టు తీర్పు ఆయ‌న‌కు అనుకూలంగానే రావ‌డం గ‌మ‌నార్హం. క‌ర్ణాట‌క‌లో సీఎంగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న‌పై బ‌ళ్లారి గ‌నుల కుంభ‌కోణం కేసు న‌మోదైంది. దాదాపు 40 కోట్ల రూపాయ‌లు అక్ర‌మంగా య‌డ్డీకి చేరాయ‌ని కేసు న‌మోదైంది. దీనిపై పెత్త ఎత్తున గంద‌ర‌గోళం జ‌రిగింది. జిందాల్ సంస్థ‌కు పెద్ద ఎత్తున ఆయ‌న ల‌బ్ధి చేకూర్చార‌ని కూడా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప‌ద‌విని కూడా కోల్పోయారు. త‌ర్వాత ఆయ‌న కోర్టు నుంచి బెయిల్ పొందారు. ప్ర‌స్తుతం ఆయ‌న బెయిల్ మీదే ఉన్నారు.

కాగా, ఈ కేసు విచార‌ణ సీబీఐ ప్ర‌త్యేక న్యాయ‌స్థానంలో బుధ‌వారం మ‌రోసారి వ‌చ్చింది. దీంతో య‌డ్యూర‌ప్ప త‌ర‌ఫున వాద‌న‌లు విన్న న్యాయ‌మూర్తి ఈ కేసులో య‌డ్యూర‌ప్ప‌కు ఎలాంటి సంబంధ‌మూ లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ క్ర‌మంలో బళ్లారి మైనింగ్ కేసులో యడ్డీని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పారు. య‌డ్డీ స‌హా మ‌రో ముగ్గురిని కూడా సీబీఐ న్యాయ‌మూర్తి నిర్దోషులుగా ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. దీంతో య‌డ్డీ స‌హా ఆయ‌న మ‌ద్ద‌తు దారులు బెంగ‌ళూరులో సంబ‌రాల్లో మునిగిపోయారు. వ‌చ్చే యేడాది క‌ర్ణాట‌క‌లో జ‌రిగే ఎన్నిక‌ల దృష్ట్యా ఈ తీర్పు బీజేపీకి మంచి ఆక్సిజ‌న్ ఇచ్చింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/