Begin typing your search above and press return to search.

ఇండియన్ ఆర్మీలో నకిలీ ఆయుధాలు?

By:  Tupaki Desk   |   23 July 2017 8:05 AM GMT
ఇండియన్ ఆర్మీలో నకిలీ ఆయుధాలు?
X
ఇండియాపై చైనా భారీ కుట్రకు పాల్పడుతున్నట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. భారత సైనికులు వాడుతున్న ఆయుధాల్లో నకిలీలను చొప్పించేందుకు చైనా భారీ కుట్ర చేసినట్లు వెల్లడైంది. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, 'మేడిన్ జర్మనీ' పేరిట చైనా ఆయుధ విడిభాగాలు వస్తున్నాయని గుర్తించింది.

ఢిల్లీకి చెందిన ఆయుధ విడిభాగాల సంస్థ సింధ్ సేల్స్ సిండికేట్, గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ (జీసీఎఫ్) లోని కొందరు అధికారులు ఈ మొత్తం కుట్రలో భాగస్వాములని సీబీఐ గుర్తించింది. మధ్యప్రదేశ్ లోని జీసీఎఫ్ లో బోఫోర్స్ శ్రేణి క్షిపణులకు అవసరమైన వైర్ రేస్ రోలర్ బేరింగ్ లు నకిలీవి సరఫరా అవుతున్నాయని తేల్చిన సీబీఐ - జీసీఎఫ్ అధికారులపై ఎఫ్ ఐఆర్ దాఖలు చేసింది.

చైనా కంపెనీలు కొన్ని సింధ్ సేల్స్ సిండికేట్ తో కుదుర్చుకున్న డీల్ లో భాగంగా జర్మనీ సంస్థ పేరిట లెటర్ హెడ్స్ తయారు చేసి, ఈ రోలర్స్ జర్మనీలో తయారైనట్టు చూపుతున్నారని, ఫోర్జరీ పత్రాల సాయంతో ఏ మాత్రం నాణ్యతలేని విడిభాగాలను ఆయుధాల్లో వాడుతున్నారని సీబీఐ ఆరోపిస్తోంది. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తున్న వేళ మన ఆయుధాల సామర్థ్యంపై అనుమానాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.