టీడీపీకి ఇంకో ఝలక్.. సుజనకు సీబీఐ నోటీసులు!

Thu Apr 25 2019 21:13:53 GMT+0530 (IST)

ఎన్నికల ఫలితాల గురించి అంతా ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటే.. ఇంతలో రకరకాల రాజకీయ పరిణామాలు సంభవిస్తున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. బ్యాంకులకు అప్పులను ఎగ్గొట్టిన వ్యవహారంలో తెలుగుదేశం ముఖ్య నేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం బెంగళూరులో సీబీఐ ఎదుట హాజరు కావాలని ఆ నోటీసుల్లో అధికారులు పేర్కొన్నట్టుగా సమాచారం.రెండేళ్ల కిందట నమోదు చేసిన కేసుల్లో ఇప్పుడు విచారణకు పిలిచినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రా బ్యాంకుకు డెబ్బై ఒక్క కోట్ల రూపాయల మొత్తం పై మోసం చేసిన కేసులో ఈ విచారణ అని తెలుస్తోంది.  

ఆంధ్రా బ్యాంక్ తో పాటు కార్పొరేషన్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను కూడా నేరపూరిత కుట్రతో మోసం చేసినట్టుగా అభియోగాలు నమోదు అయ్యాయి. మొత్తంగా బ్యాంకులకు మూడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల మేరకు నష్టం కలిగించినట్టుగా అభియోగాల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో సుజనా గ్రూప్ కు చెందిన మూడు వందల కోట్ల రూపాయలకు పై చిలుకు మొత్తానికి సంబంధించిన ఆస్తులు జప్తులో ఉన్నాయి.

ఈ అభియోగాలతో సహా ఫెమా డీఆర్ఐ లకు సంబంధించిన కేసులు కూడా చౌదరి పై నమోదయ్యాయి. చౌదరిపై మారిషస్ బ్యాంకుతో వివిధ కేసులు చాలా కాలం నుంచినే పెండింగ్ లో ఉన్నాయి. కోర్టులో విచారణ అవి సాగుతూ వచ్చాయి. అయితే గత కొన్నాళ్లుగా ఈ తెలుగుదేశం నేతకు ఇలాంటి పరిణామాలు ఎదురవుతూ వస్తున్నాయి.