సీబీఐ తాజా మాజీ చీఫ్ కు సుప్రీం అసాధారణ శిక్ష!

Tue Feb 12 2019 13:48:31 GMT+0530 (IST)

మరో సంచలనం. మోడీ సర్కారు ఆత్మరక్షణలో పడటమే కాదు.. ఇలాంటి వ్యక్తిని మోడీ ప్రభుత్వం ఎంపిక చేసిందా? అన్న భావన సగటు జీవిలో కలిగే పరిస్థితి. ఇప్పటివరకూ ఎప్పుడూ లేని రీతిలో సుప్రీంకోర్టు ఈరోజు అసాధారణమైన నిర్ణయాన్ని తీసుకుంది. తాజా మాజీ సీబీఐ చీఫ్ నాగేశ్వరరావుకు షాకింగ్ శిక్షను విధించిన సుప్రీంకోర్టు సంచలనం సృష్టించింది.ఈ మధ్యనే అర్థరాత్రి వేళ సీబీఐ చీఫ్ ను మార్చేసి.. తెలుగోడైన నాగేశ్వరరావును మోడీ సర్కారు నియమించటం.. అర్థరాత్రి దాటిన తర్వాత ఆయన సీబీఐ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించటం.. దానిపై పెద్ద ఎత్తున రభస జరగటం.. చివరకు ఆయన్ను పదవి నుంచి తప్పించటం లాంటివి తెలిసిందే.

నాగేశ్వరరావును సీబీఐ చీఫ్ గా నియమించినప్పటికీ.. అప్పటికే వెల్లువెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో సుప్రీంకోర్టు కొన్ని పరిమితులు విధించింది. కీలక నిర్ణయాలు తీసుకోకూడదని ఆదేశించింది. అయితే... సుప్రీం ఆదేశాల్ని లైట్ తీసుకునేలా ముజఫర్ పూర్ వసతి గృహ అత్యాచారాల కేసులో దర్యాప్తు చేస్తున్న అధికారి ఎస్ కే శర్మను బదిలీ చేస్తూ నిర్ణయం  తీసుకున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీం.. నాగేశ్వరరావు తీసుకున్న నిర్ణయం సరికాదని కోర్టు నిర్దారించింది.

సుప్రీం ఆదేశాల్ని కాదని.. నాగేశ్వరరావు తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అసాధారణ శిక్షను విధించింది. ఆయనకు రూ.లక్ష జరిమానాతో పాటు.. నేడు (మంగళవారం) కోర్టు కార్యకలాపాలు ముగిసే వరకూ కోర్టులోనే ఉండాలన్న శిక్షను విధించింది. ముజఫర్ పూర్ అత్యాచార కేసు దర్యాప్తు నుంచి అధికారుల్ని బదిలీ చేయకూడదని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. కానీ.. సీబీఐ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన నాగేశ్వరరావు అందుకు భిన్నంగా ఆయన్ను దర్యాప్తు నుంచి తప్పించారు.

దీంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఆయనకు కోర్టు ధిక్కారణ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు హాజరయ్యారు నాగేశ్వరరావు.  ఆయన తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. నాగేశ్వరరావు ఉద్దేశ పూర్వకంగా దర్యాప్తు అధికారిని మార్చలేదని.. ఇందుకు సంబంధించి ఇప్పటికే కోర్టుకు క్షమాణలు చెప్పిన విషయాన్ని చెప్పారు. అయితే.. ఈ వాదనకు  సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఇది కోర్టు ధిక్కారం కాకపోతే.. ఇంకేంటి? అంటూ ప్రశ్నించటమే కాదు.. లక్ష రూపాయిల జరిమానాను.. రోజంతా కోర్టులో ఉండేలా శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. సుప్రీం చర్య ఇప్పుడు సంచలనంగా మారింది.