Begin typing your search above and press return to search.

బొత్సాకు సీబీఐ కోర్టు నుంచి సమన్లు.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   23 Aug 2019 10:45 AM GMT
బొత్సాకు సీబీఐ కోర్టు నుంచి సమన్లు.. ఎందుకంటే?
X
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు ఊహించని పరిస్థితి ఎదురైంది. అప్పుడెప్పుడో 2005 నాటి కేసుకు సంబంధించి సీబీఐ కోర్టు నుంచి ఆయన సమన్లు జారీ అయ్యాయి. తాజాగా జారీ అయిన సమన్లలో ఆయన్ను సెప్టెంబరు 12న కోర్టు ఎదుట హాజరు కావాలని కూడా ఆదేశించింది. దివంగత మహానే వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఫోక్స్ వ్యాగన్ ఉదంతం పెనుసంచలనమైంది. అప్పట్లో భారీ పరిశ్రమల మంత్రిగా ఉన్న ఆయన ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు.

ఫోక్స్ వ్యాగన్ కంపెనీని హైదరాబాద్ నుంచి విశాఖ పట్నానికి తరలించాలన్న అంశంపై బొత్స మరికొందరికి పెద్ద ఎత్తున ముడుపులు అందినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ఈ అంశంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. దీంతో..ఈ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ నాటి వైఎస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తన సొంత మంత్రిమీద ఆరోపణలు వచ్చినప్పటికీ వెనక్కి తగ్గని వైఎస్.. విచారణకు ఆదేశించారు.

విచారణలో భాగంగా ఏడుగురు నిందితుల్ని చేర్చగా.. 59 మంది సాక్షులు ఉన్నారు. ఇప్పటికే ఈ ఉదంతంపై కోర్టుకు సీబీఐ దాదాపు మూడు వేల పేజీల ఛార్జిషీట్ ను దాఖలు చేసింది. ఈ వ్యవహారంలో రూ.7కోట్లు రికవరీ అయ్యింది. మరో రూ.5.65 కోట్లు రికవరీ కావాల్సి ఉంది. దాదాపు 14 సంవత్సరాల క్రితం జరిగిన ఉదంతానికి సంబంధించి మంత్రి బొత్స సీబీఐ కోర్టుకు ఏం చెబుతారు? నిజానికి నాడు జరిగిన ఘటనలు ఆయనకు ఎంతమేర గుర్తు ఉన్నాయన్నది కూడా అనుమానమనే చెప్పాలి.