Begin typing your search above and press return to search.

అనంత పద్మనాభ స్వామి సంపద తగ్గిందా?

By:  Tupaki Desk   |   9 Oct 2015 2:26 PM GMT
అనంత పద్మనాభ స్వామి సంపద తగ్గిందా?
X
దేశంలోనే అత్యంత సంపన్నుడిగా.. ఆ మాటకు వస్తే.. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా కేరళకు చెందిన అనంత పద్మనాభస్వామి ఆలయం పేరు ప్రఖ్యాతులు సాధించిన విషయం తెలిసిందే. ఈ దేవాలయం నేలమాళిగలో ఉన్న సంపద విలువపై కొన్నేళ్ల క్రితం తీవ్ర సంచలనం రేకెత్తించటం.. మొత్తం సంపద విలువ రూ.లక్ష కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేసిన సంగతి తెలిసిందే.

పద్మనాభ స్వామి ఆలయ నేలమాళిగలో భారీగా సంపద ఉండటం.. దీన్ని లెక్కించేందుకు గతంలో సుప్రీంకోర్టు ఒక టీమ్ ను ఏర్పాటు చేయటం.. అయితే.. ఈ సంపదను మరోసారి లెక్కించాల్సిన అవసరం ఉందని మాజీ కాగ్ చీఫ్ వినోద్ రాయ్ గతంలో కోరిన దానికి తాజాగా సుప్రీం కోర్టు ఓకే చెప్పేసింది. సుప్రీం చీఫ్ జస్టిస్ హెచ్ ఎల్ దత్తుతో కూడిన ధర్మాసనం.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

గతంలో తాను చేసిన ఆడిట్ మీద అసంతృప్తి వ్యక్తం చేసిన వినోద్ రాయ్ మరోసారి తనిఖీ నిర్వహించనున్న నేపథ్యంలో.. ఈసారి ఏం జరుగుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. నేలమాళిగలో నాగబంధనం ఉందంటూ ఒక గదిని తెరవకపోవటం తెలిసిందే. అయితే.. గతంలో ఈ గదిని తెరిచినట్లుగా ఆధారాలున్నట్లు చెబుతున్నారు.

మరోవైపు.. నేలమాళిగలోని సంపదను ఉన్నతస్థాయి వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారన్న ఆరోపణ ఉంది. దీనికి సంబంధించి ఈ మధ్యనే బంగారు పూత పూసిన యంత్రం ఆలయంలో దొరికిన నేపథ్యంలో.. నేలమాళిగలోని విలువైన సంపద భద్రత మీద పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా సుప్రీం ఆదేశాలతో రంగంలోకి దిగనున్న వినోద్ రాయ్ తో.. నేలమాళిగలోని బండారం బట్టబయలు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏడాదిన్నర క్రితం జరిపిన ఆడిట్ కు.. తాజాగా నిర్వహించనున్న ఆడిట్ కు మధ్య లెక్క ఎంత తేడా వస్తుందో? వినోద్ రాయ్ లాంటి నిజాయితీపరుడు రంగంలోకి దిగనున్న నేపథ్యంలో.. స్వామివారి సంపదకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.