Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో కొత్త సీన్‌..ఉప ఎన్నిక త‌ప్పదు

By:  Tupaki Desk   |   24 March 2018 4:26 AM GMT
తెలంగాణ‌లో కొత్త సీన్‌..ఉప ఎన్నిక త‌ప్పదు
X
తెలంగాణ‌లో రాజ‌కీయాలు మ‌రింత రంజుగా మారు ఎపిసోడ్‌ కు బీజం ప‌డింది. ఓవైపు అధికార‌ - ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాల‌కు సార్వ‌త్రిక ఎన్నిక‌లకు సిద్ధ‌మ‌వుతుండ‌గా....ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చేస్తాయేమో అనే ఆలోచ‌న‌లో ఉండ‌గా...మ‌రోవైపు ఉప ఎన్నికలు వ‌చ్చిప‌డ‌టం ఖాయ‌మ‌ని తేలింద‌ని రాజకీయ వ‌ర్గాలు అంటున్నాయి. ఒక‌టి కాదు రెండు చోట్ల అసెంబ్లీ ఉప పోరు త‌ప్ప‌ద‌ని విశ్లేషిస్తున్నారు. గవర్నర్‌ ప్రసంగ సమయంలో శాసనసభలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి - ఎస్ ఏ సంపత్‌ కుమార్ సభ్యత్వాలు కోల్పోయారు. అంతేకాకుండా తాజాగా జ‌రిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే హక్కును కోల్పోయారు. దీంతో ఉపఎన్నికలు రాబోతున్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

శాసనసభలో జరిగిన సంఘటనల నేపథ్యంలో స్పీకర్‌ వారి సభ్యత్వాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు సభ్యత్వం రద్దైయినట్టు అసెంబ్లీ కార్యదర్శి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపింది. గెజిట్‌ ఆధారంగా వారికి రాజ్యసభ్య ఎన్నికల్లో ఓటు వేసే హక్కును కోల్పోయారని ఎన్నికలు సంఘం తేల్చింది. ఈ ప‌రిణామాల‌తో న‌ల్లగొండ - ఆలంపూర్‌ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు కూడా రానున్నాయని అంటున్నారు. కాంగ్రెస్‌ - టీఆర్ ఎస్‌ పార్టీలు ఉప పోరు ఎదుర్కొక తప్పదని - అందుకనుగుణంగానే రాజకీయాలు హీటెక్కుతున్నాయని చెప్తున్నారు. సాధారణ ఎన్నికల సమయం మాత్రం 14 మాసాలు ఉండటంతో ఉప ఎన్నికలు ఇంత తొందరంగా రాకపోవచ్చని కాంగ్రెస్‌ నేతలు అంచనా వేస్తున్నారు.

కాగా, సభ్యత్వాల రద్దుపై అంతకు ముందే కోమటిరెడ్డి - సంపత్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆరువారాలపాటు ఎటువంటి నోటిఫికేషన్‌ విడుదల చేయకూడదంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. దీనికనుగుణంగానే మే 20 తర్వాత నల్లగొండ - ఆలంపూర్‌ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలను ఉటంకిస్తూ ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

ఇదిలాఉండ‌గా... తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన అన్ని ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్‌ గెలిచింది. నల్లగొండ, ఆలంపూర్‌ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలొచ్చినా పైచేయి సాధిస్తుందని టీఆర్ ఎస్‌ వర్గాలు ధీమాతో ఉన్నాయి. అందుకు అధికార టీఆర్ ఎస్‌ సమాయత్తమవుతున్నట్టు ఆ వర్గాలు అంటున్నాయి. బలమైన కారణం లేకుండానే సభ్యత్వాలు రద్దు కావడం వల్ల ఆ సానుభూతి వల్ల గెలుస్తామని కాంగ్రెస్‌ పార్టీ అంటోంది.