Begin typing your search above and press return to search.

ఒక పువ్వు పోయింద‌ని కేసు పెట్టాడు

By:  Tupaki Desk   |   28 July 2017 12:30 AM GMT
ఒక పువ్వు పోయింద‌ని కేసు పెట్టాడు
X
అదో పువ్వు. కానీ.. ఇప్పుడు దాని కోసం పోలీసులు ప‌డుతున్న క‌ష్టాలు అన్ని ఇన్ని కావు. అంతేనా.. ఇప్పుడా పోయిన పువ్వు మీద మీడియాలో ప్ర‌ముఖంగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక‌.. పోయిన పువ్వు ఆన‌వాళ్ల కోసం.. దాన్ని చోరీ చేసిన నిందితుల్ని ప‌ట్టుకునేందుకు పోలీసులు సీసీ ఫుటేజ్ మొద‌లు.. భారీగా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఇంత‌కీ ఆ పువ్వు కోసం ఎందుకంత సంచ‌ల‌నంగా మారింది? ఒక పువ్వు కోసం ఇంత హ‌డావుడి అవ‌స‌ర‌మా? అన్న సందేహం రావొచ్చు.

కానీ.. పోయిన పువ్వు ముచ్చ‌ట పూర్తిగా తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఇంత‌కీ పోయిన పువ్వు దొరికిందా? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు రాబ‌ట్టే ముందే.. ఈ పువ్వు గురించి మొద‌ట తెలుసుకోవాల్సిందే.

చైనాలోని ఓ షాపులో ఓ మ‌హిళ ఓ పువ్వును కొంది. అయితే.. అది అంత‌గా బాగోలేద‌ని.. తాను కొన్న పువ్వును అక్క‌డే పెట్టేసి.. దాని ప‌క్క‌నే ఉన్న ఐరీస్ జ‌పొనికా (బ‌ట‌ర్ ఫ్లై ఫ్ల‌వ‌ర్ గా) పిలిచే మ‌రో పువ్వును తీసుకెళ్లిపోయింది. ఆమె వెళ్లిన కాసేప‌టికి బ‌ట‌ర్ ఫ్లై పువ్వు మిస్ కావ‌టాన్ని గుర్తించిన షాపు వాళ్లు కంగారు ప‌డ్డారు.

వారు అంత‌గా హ‌డావుడి ప‌డ‌టానికి కార‌ణంగా బ‌ట‌ర్ ఫ్లై పువ్వు మామూలుది కాదు. ఎనిమిదేళ్లు ఎంతో క‌ష్ట‌ప‌డి సేద్యం చేస్తే కానీ ఆ పువ్వు రాలేదు. ఆ పువ్వు విలువ అక్ష‌రాల రూ.20 కోట్లు. ఆ అరుదైన‌.. ఖ‌రీదైన పువ్వు లాంటి పువ్వుల్ని పండించి.. వాటితో బిజినెస్ చేయాల‌న్న ఉద్దేశంతో స‌ద‌రు షాపు య‌జ‌మాని ఆ పువ్వును షాపులో ఉంచార‌ట‌. అయితే.. స‌ద‌రు మ‌హిళ‌కు ఈ విష‌యం తెలీక త‌న‌తో తీసుకెళ్లిపోయింది.

దీంతో.. కోట్లు విలువ చేసే ఆ ఒక్క పువ్వు కోసం షాపు య‌జ‌మాని పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చాడు. పువ్వు విలువ తెలిసిన పోలీసులు అవాక్కై.. దాన్ని తీసుకెళ్లిన వారి ఆచూకీ తెలుసుకునేందుకు చాలానే ప్ర‌య‌త్నాలు చేశారు. చివ‌ర‌కు ఆ పువ్వును త‌న‌తో తీసుకెళ్లిన మ‌హిళను గుర్తించి.. వారింటికి వెళ్లి దాన్ని స్వాధీనం చేసుకున్నార‌ట‌. అయితే.. జ‌రిగిన విష‌యాన్ని చెప్పటం.. అందులో త‌ప్పు ఏమీ లేక‌పోవ‌టంతో స‌ద‌రు మ‌హిళ‌పై ఎలాంటి కేసు న‌మోదు చేయ‌కుండా పోలీసులు వ‌దిలేశారు. కోట్ల రూపాయిల పువ్వు దొర‌క‌టంతో షాపు వాళ్లు రిలాక్స్ అయ్యార‌ట‌.