Begin typing your search above and press return to search.

ట్రంప్ వలస విధానం ఎంత డేంజరో చెప్పారు..

By:  Tupaki Desk   |   16 Oct 2019 10:46 AM GMT
ట్రంప్ వలస విధానం ఎంత డేంజరో చెప్పారు..
X
అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బిజినెస్ విశ్వవిద్యాలయాలు తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు రాసిన లేఖ సంచలనంగా మారింది. అమెరికన్లే ఫస్ట్.. విదేశీయులు వద్దంటూ కఠిన వీసా - ఇమిగ్రేషన్ (వలస) విధానాలను పాటిస్తూ విదేశీయులకు దారులు మూసేస్తున్న ట్రంప్ కు వీరు రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. ఈ లేఖను వాల్ స్ట్రీట్ జర్నల్ మీడియా ప్రచురించడంతో వెలుగుచూసింది.

ఈ బిజినెస్ విశ్వవిద్యాలయాలు రాసిన లేఖలో ప్రధానంగా ట్రంప్ వలస విధానంలో భారీ మార్పులు తీసుకురావాలని స్పష్టం చేశాయి. మంచి నైపుణ్యం గల విదేశీ నిపుణులను - పనివాళ్లను దేశంలోకి అనుమతించాలని స్పష్టంచేశాయి. అమెరికా ఆర్థికవృద్ధికి - భవిష్యత్ సాంకేతిక పునర్నిర్మాణానికి ఇది అత్యవసరమని అభిప్రాయపడ్డాయి. మంచి నైపుణ్యం గల పనిమంతులను ఆకర్షించే విధంగా దేశ ఇమిగ్రేషన్ విధానాన్ని సమీక్షించాలని ట్రంప్ తోపాటు అమెరికా చట్టసభ నాయకులకు ఈ బహిరంగ లేఖలో స్పష్టం చేశాయి.

ఈ విశ్వవిద్యాలయాలు సూటిగా ట్రంప్ ను హెచ్చరించాయి. ట్రంప్ చేస్తున్న పనుల వల్ల అస్థిర వాతావరణం ఏర్పడి అత్యున్నత నైపుణ్యం గల వలసదారులను దేశంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయని - దేశ ఆర్థిక వృద్ధికి వారి రాక కీలకమని విశ్వవిద్యాలయాల అధిపతులు స్పష్టం చేశారు.ట్రంప్ వీసాల కఠినంతో మూడేళ్లుగా అమెరికాలోని యూనివర్సిటీలు - బిజినెస్ స్కూళ్లలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గిందని విశ్వవిద్యాలయాలు లేఖలో పేర్కొన్నాయి. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు చేటు తెస్తుందని వారు హెచ్చరించారు.

డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక హెచ్1 బీ వీసాలు గణనీయంగా తగ్గిపోయాయి. 2004లో 1.95 లక్షల వీసాలు ఇవ్వగా.. ప్రస్తుతం ట్రంప్ 85వేల వీసాలకే కుదించాడు. ఈ తిరస్కరణ ఇంకా పెరుగుతోంది. 2019లో వీసాల తిరస్కరణ ఏకంగా 32శాతానికి పెరిగింది. ట్రంప్ కఠిన విధానాలతో వీసా దరఖాస్తులు కూడా భారీగా పడిపోతున్నాయి. దీంతో ట్రంప్ సర్కారు వలస వ్యతిరేక విధానాలు విదేశీ నిపుణులను భయపెడుతున్నాయని.. వారు రాకపోతే దేశ ఆర్థిక రంగంపై ప్రభావం చూపుతోందని విశ్వవిద్యాలయాలు హెచ్చరించాయి.