పుల్వామా తర్వాతైనా..బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇస్తారా?

Wed Feb 20 2019 10:41:56 GMT+0530 (IST)

ఉద్యోగం కోసం ప్రాణాలు అర్పించటానికి ఎవరూ సిద్ధపడరు. దేశభక్తి పుష్కలంగా ఉండటంతోపాటు.. దేశం కోసం దేనికైనా రెఢీ అనే తత్త్వం ఉన్నోళ్లు మాత్రమే ఆ రంగంలోకి వెళ్లటానికి ఇష్టపడతారు. ఏదో ఒక ఉద్యోగం అన్నోళ్లు సైన్యంలో ఉండరా?  అంటే.. ఉంటారు కానీ తక్కువ మంది ఉంటారు. అలాంటివాళ్లకు కీలక బాధ్యతలు అప్పజెప్పేది తక్కువే ఉంటుంది.యావత్ దేశాన్ని కదలించి.. అందరిని శోక సంద్రంలోకి ముంచేసిన పుల్వామా ఉగ్రదాడి ఉదంతం నుంచి భారత సర్కారు ఏదైనా పాఠాన్ని నేర్చిందా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అత్యంత ప్రమాదకరమైన జమ్ము..కశ్మీర్ లాంటి ప్రాంతాల్లో విధులు నిర్వర్తించటంతో పాటు.. ఉగ్రదాడికి ఎక్కువ అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో ఉప యోగించే వాహనాల్ని బుల్లెట్ ప్రూఫ్ గా ఉంచాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది.

బడ్జెట్ ఎక్కువైనా ఫర్లేదు.. సైనికుల ప్రాణాలకు మించిన ఖర్చు అంటూ ఉండదు. అంతేకాదు.. అత్యాధునిక ఆయుధాల్ని సైన్యానికి వెనువెంటనే అందజేయాల్సిన అవసరం ఉంది. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను ఉపయోగించుకొని ఉగ్రవాదులు రెచ్చిపోతున్న వేళ.. వారిని ఎదుర్కొనేందుకు సైన్యం.. ఇతర రక్షణ బలగాలకు అత్యాధునిక ఆయుధాల్ని అందించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. ప్రతి ఎయిర్ పోర్ట్ కు..ఎయిర్ పోర్ట్ బయట పెట్రోలింగ్ చేసే సిబ్బందికి కనీసం ఒకటి చొప్పున బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది.

దీంతో పాటు.. సున్నిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే వారికి అత్యాధునిక ఆయుధాలు ఇవ్వటంతో పాటు.. బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్ని ఇవ్వటం ద్వారా ఉగ్రదాడులతో చోటు చేసుకునే ప్రాణ నష్టాన్ని తక్కువ చేసే వీలుంది. విషాదం జరిగినప్పుడు భావోద్వేగంతో ప్రకటనలు చేసే రాజకీయ నాయకులు.. ప్రభుత్వాలు.. అలాంటివి చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా..రక్షణ చర్యల్ని మరింత పరిపుష్టం చేయాల్సిన అవసరం ఉంది.