Begin typing your search above and press return to search.

ఆ టీడీపీ నేత‌ల‌కు బుగ్గ‌న స‌వాల్!

By:  Tupaki Desk   |   19 Jun 2018 1:28 PM GMT
ఆ టీడీపీ నేత‌ల‌కు బుగ్గ‌న స‌వాల్!
X
య‌థా రాజా త‌థా ప్ర‌జ అన్న త‌ర‌హాలో ఉంది టీడీపీ ఎమ్మెల్యేల ప‌రిస్థితి. ఓ వైపు గోబెల్స్ ప్ర‌చారం ర్యాంకింగ్స్ లో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంటే....తాము కూడా సీఎంగారి క‌న్నా నాలుగు ఆకులు ఎక్కువే చ‌దివాం అన్న త‌ర‌హాలో టీడీపీ ఎమ్మెల్యేలు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఢిల్లీలో అమిత్ షాను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే - పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్ క‌లిశార‌ని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు - టీడీపీ త‌ర‌ఫున నామినేట్ అయిన రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ లు అస‌త్య ఆరోప‌ణ‌లు గుప్పించిన విష‌యం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో ఆ ఆరోప‌ణ‌ల‌పై బుగ్గ‌న ఘాటుగా స్పందించారు. ఆ ఇద్ద‌రు టీడీపీ నేతలపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. తన హక్కులకు - ప‌రువు ప్రతిష్టల‌కు భంగం కలిగించిన వారిపై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

త‌నపై ఆ ఇద్ద‌రు టీడీపీ నేత‌లు చేసిన ఆరోపణలను బుగ్గ‌న తీవ్రంగా ఖండించారు. అమిత్ షాను తాను కలవలేదని - త‌న మిత్రుడు - బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను కలవ‌డంలో తప్పేమిట‌ని ప్ర‌శ్నించారు. పీఏసీ చైర్మన్ అయిన తనపై నిరాధార ఆరోపణలు చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. వైసీపీకి బీజేపీకి సంబంధాలున్నాయ‌ని టీడీపీ నేత‌ల గోబెల్స్ ప్ర‌చారాన్ని మానుకోవాల‌న్నారు. ఏపీ భవన్‌లో లాగ్ బుక్ ట్యాపరింగ్ చేయడం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. బీజేపీతో ఇప్ప‌టికీ ర‌హ‌స్య స్నేహం కొన‌సాగిస్తోంది టీడీపీ అని విమర్శించారు. తనపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను నిరూపిస్తే ఎమ్మెల్యే - పీఏసీ చైర్మన్ పదవులకు రాజీనామా చేస్తానన్నారు. ఆ ఆరోప‌ణ‌ల‌ను నిరూపించ‌కుంటే....టీడీపీ నేత‌లు రాజీనామాల‌కు సిద్ధ‌మా అని ప్ర‌శ్నించారు. టీడీపీ నేతలు సిద్ధంగా ఉంటే త‌న‌ సవాల్ ను స్వీకరించాలని బుగ్గ‌న ఘాటుగా స్పందించారు. మ‌రి, బుగ్గ‌న స‌వాల్ ను టీడీపీ నేత‌లు స్వీక‌రిస్తారో లేదో వేచి చూడాలి.