బడ్జెట్ స్పెషల్: ఇన్ కం ట్యాక్స్ రద్దవుతుందా?

Fri Jan 19 2018 21:10:01 GMT+0530 (IST)

ఇన్‌కం ట్యాక్స్. పక్కాగా కట్టేవారిలో ప్రభుత్వ ఉద్యోగుల తర్వాత మధ్యతరగతి వారే. పేదలు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. డబ్బున్నోళ్లు మాత్రం ఎగ్గొట్టే మార్గాలు అన్వేషిస్తారు. 50 ఏళ్లుగా ఇదే జరుగుతుంది. 120 కోట్ల మంది జనంలో ఆదాయ పన్ను కట్టేవారు కేవలం 2శాతం మాత్రమే. ప్రభుత్వ ఆదాయం కూడా అంతంతమాత్రమే. ఆదాయ పన్ను విధానాన్ని రద్దు చేయటం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదని కేంద్రం భావిస్తోందని ఈ మేరకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.అయితే ఆదాయ పన్ను రద్దు చేయటం సాధ్యమేనా అనే వాదన ఉంది. ఇది కచ్చితంగా సాధ్యమే అంటున్నారు నిపుణులు. పెద్ద నోట్ల రద్దు - జీఎస్టీ వంటి విప్లవాత్మకమైన నిర్ణయాలే తీసుకున్నప్పుడు.. ఇది పెద్ద కష్టం ఏమీ కాదని చెబుతున్నారు. ఇన్ కం ట్యాక్స్  రద్దు వల్ల మధ్య తరగతి ప్రజలకు ఊరట వస్తుంది. ఇది ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజాకర్షక ప్రచార అస్త్రం కూడా అవుతుందని చెబుతున్నారు. గత బడ్జెట్ సమయంలోనే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సైతం.. అసాధ్యం ఏమీ కాదని చెప్పారు. ఆదాయ పన్ను రద్దుతో కేంద్రం కోల్పోతున్న 2శాతం ఆదాయాన్ని రాబట్టుకునేందుకు మరో మార్గం సిద్ధం చేశారు. బ్యాంక్ లావాదేవీలపై నామ మాత్రపు పన్ను విధించేందుకు రెడీ అవుతున్నారు.

బ్యాంక్ అకౌంట్ నుంచి ఏడాది కాలంలో చేసే లావాదేవీలపై ఈ పన్నులు ఉంటుంది. దానికి కూడా లిమిట్ ఉంటుంది. ఉదాహరణకి రూ.5లక్షల రూపాయల వరకు లిమిట్ ఇచ్చారు అనుకుందాం. 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు లావాదేవీలపై 2శాతం.. 10 లక్షలు దాటితే 3శాతం 15 లక్షలు దాటితే 4శాతం ఇలా నామా మాత్రపు పన్ను విధిస్తారు.

ఆదాయంపై పన్ను రద్దు చేయటం వల్ల నల్లదనం ఉండదని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. డబ్బును దాచి పెట్టాల్సిన అవసరం ఉండదు. మొత్తం డబ్బు బ్యాంకింగ్ రంగంలోకి వస్తుంది. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతాయి. బ్యాంక్ డిపాజిట్లు పెరుగుతాయి. అప్పులు బాగా ఇవ్వొచ్చు. దీని ద్వారా ఉద్యోగ - ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని భావిస్తోంది కేంద్రం. ఏడాది కాలంలో లోక్ సభకు ఎన్నికలు జరుగుతున్న టైంలో ఇది మోడీ ప్రభుత్వానికి మంచి ప్రజాకర్షక నిర్ణయం అని కూడా అంటున్నారు ఆర్థిక నిపుణులు.