Begin typing your search above and press return to search.

రచ్చకెక్కిన టీడీపీ మంత్రి మట్టిదోపిడీ కథ..

By:  Tupaki Desk   |   23 Oct 2018 10:48 AM GMT
రచ్చకెక్కిన టీడీపీ మంత్రి మట్టిదోపిడీ కథ..
X
కర్నూలులో ఇప్పుడు మట్టి దందా జోరుగా సాగుతోంది. ఈ దందా ఇద్దరు అధికార పార్టీ నేతల మధ్య చిచ్చుకూడా పెట్టింది. ఇందులో ఒకరు మంత్రి అఖిల ప్రియ కాగా.. మరొకరు శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి.. శ్రీశైలం నియోజకవర్గంలోని మహానంది మండల పరిధి ఓ రైతు పొలం లీజుకు తీసుకొని మంత్రి అఖిల ప్రియ అనుచరులు ఎర్రమట్టిని యథేచ్ఛగా తవ్వుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. అయితే తన నియోజకవర్గంలో తాను మాత్రమే తవ్వుకుంటాని ఎమ్మెల్యే బుడ్డా ఈ తవ్వాకాలను అడ్డుకుంటున్నారు. ఇటు మంత్రి అనుచరులు - ఇటు బుడ్డా వర్గీయుల మధ్య ఇప్పుడు ఎర్రమట్టి అక్రమ తవ్వకాల దందా చిచ్చు రేపింది.

ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి.. ఇదివరకూ సన్నిహితంగా ఉంటే అఖిల ప్రియను ఉద్దేశించి కోడలా అని సంబోధించేవారు. అఖిల ప్రియ తల్లి శోభనాగిరెడ్డిని అక్కా అని పిలిచేవారు. ఇప్పుడీ మామా-కోడలు మధ్య మట్టి వివాదం రోజుకో మలుపు తిరుగుతూ అధిష్టానం దృష్టికి వెళ్లిందట.. ఏకంగా విజిలెన్స్ విభాగానికి ఎమ్మెల్యే బుడ్డా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే మట్టిదందాపై విచారణ జరుపవద్దంటూ మంత్రి అఖిల ప్రియ తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.

ఈ ఎర్రమట్టిని ఇరువురు నేతలు ఇటుకల తయారీ దారులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. నంద్యాల చుట్టుపక్కల ఉన్న 400 నుంచి 500 వరకు ఎర్ర ఇటుకల బట్టీలకు ఎమ్మెల్యే బుడ్డా - మంత్రి అఖిల ప్రియ మట్టిని అమ్ముతున్నారు. ఇప్పుడు ఇరువురు నేతల తమ మట్టినే కొనుగోలు చేయాలని బట్టీల నిర్వాహకులను బెదిరిస్తున్నట్టు సమచారం.

ఇప్పటికే జిల్లాలో మంత్రి అఖిల ప్రియతో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డికి విభేదాలున్నాయి. ఈ మట్టి దందా నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డి ఎమ్మెల్యే బుడ్డాను చేరదీసి అఖిలప్రియకు వ్యతిరేకంగా గ్రూపు కట్టినట్టు తెలిసింది.. ఇలా ఇద్దరి మధ్య చెలరేగిన మట్టి చిచ్చు జిల్లాలో వైరి వర్గాలు కూటమి కట్టేదాకా వెళ్లడంపై టీడీపీ అధిష్టానం ఆందోళన ఉన్నట్టు సమాచారం.