Begin typing your search above and press return to search.

జగన్ ఎమ్మెల్యే బుడ్డా జంప్ అయ్యారోచ్ కానీ..

By:  Tupaki Desk   |   28 April 2016 7:01 AM GMT
జగన్ ఎమ్మెల్యే బుడ్డా జంప్ అయ్యారోచ్ కానీ..
X
జగన్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే జంప్ అయ్యారు. సేవ్ డెమోక్రసీ పేరుతో ఓపక్క దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివిధ పార్టీ నేతలు.. కేంద్రమంత్రులను కలిసి ఏపీ ముఖ్యమంత్రి అనుసరిస్తున్న విధానాలపై ఫిర్యాదులు చేస్తున్న వేళ.. ఆయన పార్టీకి చెందిన కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి జంప్ అయ్యారు.

ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఏపీలో మొదలైన పార్టీ ఫిరాయింపుల పర్వం మా జోరుగా సాగుతోంది. జగన్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్ని ఒక్కొక్కరిగా సైకిల్ ఎక్కుతున్న క్రమంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి పార్టీ చేరిక కాస్త ఆసక్తికరంగా మారింది. నిజానికి ఆయన జగన్ కు ఝులక్ ఇస్తారన్న అంచనా కొంతకాలంగా ఉంది. అయితే.. మంచి రోజులు లేకపోవటం.. 29 తర్వాత మంచి ముహుర్తాలు లేని నేపథ్యంలో ఆయన హడావుడిగా సైకిల్ ఎక్కేసే కార్యక్రమాన్ని చేపట్టారు.

గురువారం ఉదయం మంచి ముహుర్తం ఉందని చెప్పటంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును హడావుడిగా కలిసిన బుడ్డా రాజశేఖర్ రెడ్డికి పార్టీ కండువా కప్పి.. స్వాగతం పలికారు. మంచి రోజులు లేకపోవటంతో ప్రస్తుతానికి పార్టీ కండువా కప్పించుకున్న బుడ్డా.. రానున్న రోజుల్లో తాడేపల్లిలో జరిగే కార్యక్రమంలో బుడ్డాను పార్టీలోకి అధికారికంగా ఆహ్వానించనున్నారు. చూస్తుంటే.. చంద్రబాబు మాత్రమే కాదు.. తాజాగా పార్టీలోకి వస్తున్న నేతలు సైతం నమ్మకాలకు ఎక్కువ విలువ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఏపీ ముఖ్యమంత్రి కనుక ఏపీ రాజధాని అమరావతిలో భూమిపూజ.. శంకుస్థాపన.. తాత్కాలిక సచివాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన.. మళ్లీ ప్రారంభోత్సవానికి మరో కార్యక్రమం చేపట్టటం తరహాలోనే.. కండువా కప్పించుకోవటానికి ఒక ముహుర్తం.. పార్టీలో చేరటానికి మరో ముహుర్తం పెట్టుకోవటం గమనార్హం. నమ్మకాల విషయంలో అధినేతకు తగ్గ తమ్ముళ్లే దొరుకుతున్నారే.