Begin typing your search above and press return to search.

అవార్డులు అప్పుడెందుకు ఇవ్వలేదు?

By:  Tupaki Desk   |   7 Oct 2015 2:57 PM GMT

ప్రధానమంత్రి మోడీ మీద తమకున్న కోపాన్ని బుద్ధజీవులు మరోసారి బయటపెట్టేశారు. ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న మత విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా గతంలో ప్రభుత్వాలు తమకిచ్చిన అత్యున్నత పురస్కరాల్ని వెనక్కి పంపిస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్న ఘటనకు నిరసనగా భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మేనకోడలు నయనతార సెహగల్ తనకిచ్చి సాహిత్య అవార్డును వెనక్కి ఇచ్చేసి సంచలనం సృష్టించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మోడీ సర్కారు ఉదాసీన వైఖరిని ప్రశ్నిస్తూ.. మరో ప్రముక కవి.. అశోక్ వాజ్ పేయ్ తనకిచ్చిన సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కి ఇచ్చి వేస్తున్నట్లు ప్రకటించారు.

నిజమే.. కవులు.. కళాకారులు.. మేధావులు.. సమాజంలో జరిగే అరాచకాలకు.. ప్రభుత్వాల వైఖరిని తప్పు పడుతూ తమ నిరసన వ్యక్తం చేయటంలో తప్పు లేదు. నిజానికి అలాంటి చైతన్యం తప్పనిసరి కూడా. కాకపోతే.. మేధావులు.. బుద్ధజీవుల దృష్టి కోణం ఒంటి కన్నుతో తప్పిస్తే.. రెండు కళ్లతో లేకపోవటం గమనార్హం.

నరేంద్ర మోడీపై హిందుత్వ ముద్ర వేసేసి.. అతను కానీ ప్రధానమంత్రి అయిపోతే.. ఈ దేశం దారుణంగా నష్టపోతుందని.. అంతకు మించిన ఘోరం మరొకటి ఉండదంటూ వ్యవహరించటం కొత్తేం కాదు. మోడీ మీద కోపం.. అకోశ్రమే తప్పించి.. ఇప్పుడు దాద్రిలో చోటు చేసుకున్న మతవిద్వేషాలు.. ఆపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు తాము ఇలాంటి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటిస్తూ వార్తల్లోకి వస్తున్నారు.

ఒకవేళ.. ఇలాంటి మతవిద్వేష ఘటనలు మోడీ హయాంలోనే జరిగాయా? గతంలో జరగలేదా? అని చరిత్రను చూస్తే.. మచ్చలు చాలానే కనిపిస్తాయి. అలా అని.. దాద్రి ఘటనను సమర్థించటం లేదు. దాద్రి లాంటి ఘటనల్ని తీవ్రంగా ఖండించాల్సిందే. అదే సమయంలో.. అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందన్న విషయంపై కూడా దృష్టి సారించి.. సమాజంలో కలకలానికి కారణమైన వారిని.. చట్టం తమ చేతుల్లోకి తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

కాకపోతే.. ఇప్పుడు ఇంత ఇదిగా స్పందిస్తున్న బుద్ధజీవులు.. పదేళ్ల యూపీఏ హయంలో చోటు చేసుకున్న ఘటనల గురించి ఎందుకు పెదవి విప్పలేదు..? 2004 నుంచి 2014 వరకు సాగిన యూపీఏ 1.. 2 హయాంలో దేశ వ్యాప్తంగా చాలానే మత విద్వేషాలు చోటు చేసుకున్నాయి.

శాంపిల్ గా చూస్తే.. 2006లో అలీగఢ్ లో రామనవమి వేడుకల సందర్భంగా జరిగిన మతవిద్వేషంలో 5 మరణాంరు. 2008లో దులేలో చోటు చేసుకున్న మత విద్వేషంలో నలుగురు అమాయకులు మరణించగా.. 200 మంది గాయపడ్డారు.

2010లో దేగ్నా (పశ్చిమబెంగాల్) అల్లర్లు సెప్టెంబరు 5న చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లు రోజుల తరబడి సాగాయి. పెద్ద సంఖ్యలో ఇళ్లను తగలబెట్టేశారు. ఇక.. 2011 సెప్టెంబరులో భరత్ పూర్ (రాజస్థాన్)లో చోటు చేసుకున్న మత విద్వేషాల్లో 8 మంది మరణిస్తే.. 23 మండి గాయపడ్డారు. 2012లో కాక్ రాజ్ హర్ (అసోం)లో చోటు చేసుకున్న మత విద్వేషాల్లో 77 మంది మరణించినట్లు అధికారిక సమాచారం. అనధికారికంగా ఇంకా ఎక్కువే ఉంటుందని చెబుతారు. 500 గ్రామాలకు చెందిన 79వేల మంది ప్రజలు 128 రిలీఫ్ క్యాంపుల్లో తల దాచుకున్నారు. తమ ఇళ్లకు వెళ్లేందుకు వణికిపోయారు. ఇప్పటికి ఆ కలకలం తాలూకు గాయాలు ఇంకా మానలేదని చెబుతారు.

ఇక.. అందరికి బాగా తెలిసిన 2013 ముజఫర్ నగర్ అల్లర్ల మాటేమిటి? 2013 ఆగస్టు.. సెప్టెంబర్ లలో చోటు చేసుకున్న మత విద్వేషకాండలో దాదాపు 62 మంది మరణించగా.. పెద్ద సంఖ్యలో ఈ ఘటనలకు కారణమయ్యారు. ఇక్కడ చెప్పేదేమంటే.. మత విద్వేషాలు ఎవరో ఒకరు రగిలిస్తేనో.. లేదంటే మోడీ లాంటి నేతలు ప్రధానమంత్రిగా ఉంటేనే చోటు చేసుకోవు. ఇందుకు చాలానే సమాజిక కారణాలు ఉన్నాయి. కానీ.. ఇవన్నీ జరిగినప్పుడు కిమ్మనకుండా ఉండిపోయి నయనతార సెహగల్.. అశోక్ వాజ్ పేయిలు అప్పుడెందుకు మౌనంగా ఉన్నారు? వారి దృష్టిలో అవేమీ అల్లర్లుగా అనిపించలేదా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. దాదాపు 10 లక్షల మంది హిందూ పండిట్లను కాశ్శీర్ నుంచి తరిమేసినప్పుడు.. ఏ కవి.. కళాకారుడు.. బుద్ధ జీవి ఎందుకు స్పందింలేదు? కాశ్శీరీ పండిట్లు మనుషులు కాదా? వారికి రక్తమాంసాలు లేవా? వారు భారతీయులు కాదా..?