Begin typing your search above and press return to search.

బ్రిట‌న్‌.. భారీగా బాదేసిందిగా..?

By:  Tupaki Desk   |   14 Oct 2018 6:07 AM GMT
బ్రిట‌న్‌.. భారీగా బాదేసిందిగా..?
X
బ్రిట‌న్ వీసా కావాలా? భ‌విష్య‌త్తులో బ్రిట‌న్ కు చ‌దువుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా? బ‌్రిట‌న్ వీసా కోసం ఏర్పాట్లు చేసుకుంటున్న వారంద‌రికి షాకిస్తూ ఆ దేశ స‌ర్కారు తాజాగా నిర్ణ‌యాన్ని తీసుకుంది. యూరోపియ‌న్ యూనియ‌న్ బ‌య‌ట దేశాల నుంచి బ్రిట‌న్ కు వ‌చ్చే వ‌ల‌స‌దారుల‌పై విధించే హెల్త్ స‌ర్ ఛార్జీని డ‌బుల్ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

తాజా నిర్ణ‌యంతో భార‌త్ నుంచి బ్రిట‌న్ కు వెళ్లాల‌ని ప్లాన్ చేసే వారి మీద భారీ భారం ప‌డ‌నుంది. విద్యార్థులు.. ఉద్యోగులు.. వారి కుటుంబ స‌భ్యులు వీసా ఫీజు కింద డ‌బుల్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇప్ప‌టివ‌ర‌కే వ‌ల‌స వీసాదారులు ఏడాదికి 200 పౌండ్లు.. మ‌న రూపాయిల్లో చెప్పాలంటే రూ.19,400 మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దీని స్థానే తాజాగా ఈ మొత్తాన్ని డ‌బుల్ చేస్తూ బ్రిట‌న్ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది.

తాజా వీసా ఛార్జీని డ‌బుల్ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్పుడు వ‌సూలు చేస్తున్న 200 పౌండ్ల స్థానే.. ఇక‌పై 400 పౌండ్ల‌ను వ‌సూలు చేయ‌నున్నారు. దీంతో రూ.20వేల వ‌ర‌కూ క‌ట్టే స్థానే ఇక‌పై రూ.40వేల వ‌ర‌కూ చెల్లించాల్సి ఉంటుంది. తాజా పెంపు కార‌ణంగా ఏడాదికి బ్రిట‌న్ జాతీయ ఆరోగ్య సేవ‌ల ప‌థ‌కానికి 22 కోట్ల పౌండ్ల అద‌న‌పు మొత్తం వారికి రానుంది. అయితే ఈ పెంపు యూరోపియ‌న్ దేశాల నుంచి బ్రిట‌న్ కు వెళ్లే వారి నుంచి కాకుండా మిగిలిన ప్ర‌పంచ దేశాల‌కు చెందిన వారంతా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పెంపును తాజాగా బ్రిట‌న్ వ‌ల‌స‌ల శాఖా మంత్రి క‌రోలిన్ నోక్స్ స‌మ‌ర్థించుకున్నారు. దీర్ఘ‌కాలం బ్రిట‌న్ లో ఉండాల‌నుకునే వారికి త‌మ తాజా పెంపు సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. వ‌ల‌స‌దారుల‌కు తాము వ‌ర్తిస్తున్న ఆరోగ్య ప‌థ‌కం కార‌ణంగా వారు అద‌న‌పు మొత్తాన్ని చెల్లించినా.. దాని కార‌ణంగా వారు పొందే ల‌బ్థి ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు. వ‌ల‌స‌దారుల‌కు ప్ర‌భుత్వం క‌ల్పించే ఆరోగ్య సేవ‌ల‌కు సంబంధించి కాస్త భారాన్ని వ‌ల‌స‌దారులు మోయ‌టం న్యాయ‌మే అవుతుంద‌ని చెబుతున్నారు. పెంచిన ప్ర‌తోడు ఏదో ఒక వాద‌న‌ను వినిపించి స‌మ‌ర్థించుకుంటారే త‌ప్పించి.. అందుకు భిన్నంగా వ్యాఖ్యానించ‌రు క‌దా?