Begin typing your search above and press return to search.

కోర్టు తీర్పు..బ్రెగ్జిట్ ఇంకా పూర్తి కాలేదు

By:  Tupaki Desk   |   24 Jan 2017 5:23 PM GMT
కోర్టు తీర్పు..బ్రెగ్జిట్ ఇంకా పూర్తి కాలేదు
X
ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన బ్రెగ్జిట్ ప‌రిణామంపై అనూహ్య నిర్ణ‌యం వెలువ‌డింది. యూకే పార్ల‌మెంట్ ఆమోదం త‌ర్వాతే యురోపియ‌న్ యూనియ‌న్ నుంచి బ్రిట‌న్ వైదొలిగే ప్ర‌క్రియ‌ను ప్రారంభించాల‌ని ఆ దేశ ప్ర‌ధాన‌మంత్రి థెరెసా మేకు ఆ దేశ సుప్రీంకోర్టు స్ప‌ష్టంచేసింది . ప్ర‌ధానికి ఉండే ఎగ్జిక్యూటివ్ ప‌వ‌ర్స్ (రాయ‌ల్ ప్రిరొగెటివ్‌)ను ఉప‌యోగించి ఈయూ లిస్బ‌న్ ట్రీటీలోని ఆర్టిక‌ల్ 50ని ప్ర‌యోగిస్తామ‌న్న ప్ర‌భుత్వ వాద‌న‌ను కోర్టు తోసిపుచ్చింది. ఆర్టిక‌ల్ 50ను ప్ర‌యోగిస్తే బ్రెగ్జిట్ ప్ర‌క్రియ మొద‌ల‌వుతుంది. అయితే అది జ‌ర‌గాలంటే నార్త‌ర్న్ ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, వేల్స్‌లోని అసెంబ్లీల అనుమ‌తి త‌ప్ప‌నిస‌ర‌ని కోర్టు స్ప‌ష్టంచేసింది. రెఫెరెండ‌మ్‌కు ప్రాధాన్య‌త ఉన్నా.. ఆ త‌ర్వాత ఏం జ‌ర‌గాల‌న్న‌దానిపై పార్ల‌మెంట్ ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ డేవిడ్ న్యూబెర్గ‌ర్ అన్నారు.

బ్రెగ్జిట్ విష‌యంలో న‌మోదైన పిటిష‌న్‌ ను విచార‌ణ చేప‌ట్ట‌గా న్యాయ‌మూర్తుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. సుప్రీంకోర్టు ధర్మాస‌నం 8-3 తేడాతో ప్ర‌భుత్వ వాద‌న‌కు విరుద్ధంగా పార్ల‌మెంట్ ఆమోదం త‌ప్ప‌నిస‌రి అన్న నిర్ణ‌యం తీసుకుంది. రెఫ‌రెండ‌మ్‌ను అమ‌లు చేసేలా చ‌ట్టాన్ని మార్పు చేయాలంటే యూకే రాజ్యాంగం పార్ల‌మెంట్‌కే అధికారం క‌ట్ట‌బెట్టింద‌ని కోర్టు తెలిపింది. మార్చిలోపు ఆర్టిక‌ల్ 50ని ప్ర‌యోగిస్తాన‌ని ప‌దేప‌దే చెబుతున్న థెరెసా మె.. ఇప్పుడిక క‌చ్చితంగా పార్ల‌మెంట్ ఆమోదం తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే ప్ర‌తిప‌క్ష లేబ‌ర్ పార్టీ దీనికి అనుకూలంగా ఉండ‌టంతో అది పెద్ద క‌ష్ట‌మేమీ కాక‌పోవ‌చ్చు. మ‌రోవైపు కోర్టులో ప్ర‌భుత్వం ఓడిపోయింద‌ని తెలినే మొద‌ట పౌండ్ కాస్త పుంజుకున్నా.. త‌ర్వాత సగం సెంట్ కోల్పోయింది. ఈ ప‌రిణామంతో మార్కెట్ లో ఆ దేశాల షేర్లు ప‌డిపోయాయి.