Begin typing your search above and press return to search.

ఇదేం చెత్త రూల్.. ఐసీసీపై ఆగ్రహ జ్వాల

By:  Tupaki Desk   |   15 July 2019 9:19 AM GMT
ఇదేం చెత్త రూల్.. ఐసీసీపై ఆగ్రహ జ్వాల
X
50 ఓవర్లలో ఇంగ్లాండ్ చేసిన స్కోరు.. న్యూజిలాంచ్ చేసిన స్కోరు ఒకటే. ఆ తర్వాత సూపర్ ఓవర్లలోనూ ఇరు జట్ల స్కోర్లు సమానం. అలాంటపుడు విజేతను నిర్ణయించడానికి ఇంకో సూపర్ ఓవర్ వేయించాలి. లేదంటే 2007 టీ20 ప్రపంచకప్‌‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ లో మాదిరి బౌలౌట్ అయినా ప్రయత్నించి ఉండాలి. లేదంటే ఇరు జట్లనూ సంయుక్త విజేతలుగా అయినా ప్రకటించి ఉండాలి. కానీ అదేమీ లేకుండా మ్యాచ్‌ లో ఎక్కువ బౌండరీలు కొట్టిందన్న కారణంతో ఇంగ్లాండ్‌ ను ప్రపంచ విజేతగా నిలబెట్టడం ఇప్పుడు క్రికెట్ ప్రపంచానికి ఏ మాత్రం రుచించడం లేదు. ఇది మ్యాచ్ తర్వాత తీసుకొచ్చిన రూల్ ఏమీ కాదు. టోర్నీ ఆరంభానికి ముందు పెట్టింది. అయినప్పటికీ ఇదేం చెత్త రూల్ అంటూ ఐసీసీ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాజీ క్రికెటర్లు - విశ్లేషకులు - అభిమానులు.

ఇంగ్లాండ్‌‌ తో సమానంగా పరుగులు చేసినా.. వాళ్లను మించి పోరాట పటిమ ప్రదర్శించినా.. అదృష్టం కలిసి రాక.. అసమంజసమైన ఐసీసీ నిబంధన వల్ల న్యూజిలాండ్ ప్రపంచ కప్‌ ను కోల్పోయింది. ఇలా గెలిచినందుకు ఇంగ్లాండ్ వాళ్లలోనూ సంపూర్ణ ఆనందం లేదు. న్యూజిలాండ్‌ కు దక్కాల్సిన కప్పును ఇంగ్లాండ్ అందుకున్నట్లుగా అనిపిస్తోంది ఆ దేశస్థులకు. ఇక మిగతా ప్రపంచం సంగతి చెప్పాల్సిన పని లేదు. అందరూ న్యూజిలాండ్ వైపే ఉన్నారు. ఆ జట్టుకు అన్యాయం జరిగిందంటున్నారు. బౌండరీల ఆధారంగా ప్రపంచ విజేతను నిర్ణయించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. బ్రెట్ లీ - సంజయ్ మంజ్రేకర్ - గౌతమ్ గంభీర్ .. ఇంకా ఎంతోమంది ఐసీసీ నిబంధనపై విమర్శలు గుప్పిస్తున్నారు. కచ్చితంగా రూల్స్ మార్చాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు.