Begin typing your search above and press return to search.

ఆమ్ ఆద్మీపార్టీ ఆఫ్రికాలోనూ చిచ్చు పెట్టింది

By:  Tupaki Desk   |   25 May 2017 7:06 AM GMT
ఆమ్ ఆద్మీపార్టీ ఆఫ్రికాలోనూ చిచ్చు పెట్టింది
X
ఇండియాలో ఈవీఎంల గురించి ఎంత రచ్చ జరుగుతోందో తెలిసిందే. మన ఈవీఎంల టెక్నాలజీ తిరుగులేనిదని... వీటిని ట్యాంపర్ చేయడం అసాధ్యమని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కూడా ఢంకా భజాయించి మరీ చెబుతున్నా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ సహా పలు ఇతర విపక్షాలు తీవ్ర ఆరోపనలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈవీఎంలు ట్యాంపర్ చేసి చూపించాలంటూ ఎన్నికల సంఘం సవాల్ విసరడం అందుకు జూన్ 3 నుంచి అవకాశం కల్పిస్తుండడం తెలిసిందే. అయితే... ఈ ఈవీఎంల గోల కేవలం భారత్ కే పరిమితం కాలేదు. ఆప్రికా ఖండంలోని బోట్సువానాలోనూ ఈవీఎంల రచ్చ మొదలైంది. అందుకు కారణం ఈ ఏడాది అక్కడ జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఇండియన్ మేడ్ ఈవీఎంలను ఉపయోగించబోతుండడమే.

బోట్సువానాలో ఈ ఏడాది జరగబోయే ఎన్నికలను పూర్తిగా ఎలక్రానిక్ వోటింగ్ మిషన్లతో నిర్వహించాలని తలపెట్టారు. మన దేశంలో ఈవీఎంలు తయారుచేసే ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ర్టానిక్స్ లిమిటెడ్ వాటిని తయారుచేసి బోట్సువానా పంపించింది. అంతవరకు బాగానే ఉన్నా ఈలోగా ఇండియాలో ఈవీఎంలపై అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ రచ్చ చేయడం.. ఇవి ట్యాంపరబుల్ అని ఆరోపిస్తుండడంతో ఆ సంగతి బోట్సువానా వరకు చేరింది. దాంతో అక్కడి విపక్షాలు కూడా ఇదే పల్లవి అందుకున్నాయి. ఈవీఎంలు వాడొద్దంటూ ఆందోళలనలకు దిగుతున్నాయి.

దీంతో మన ఎన్నికల సంఘం మాదిరిగానే బోట్సువానాలోని ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్ కూడా వీటిని ట్యాంపర్ చేసి చూపించాలంటూ సవాల్ విసిరింది. అందుకు మన కంటే ముందే ఈ నెలలో ఛాన్సిచ్చింది. ఈవీఎంలను ట్యాంపర్ చేయగలం అనుకుంటున్నవారు ముందుగా రిజిష్టర్ చేసుకుని చేసి చూపించాలని అంటోంది.

మరోవైపు మన ఎన్నికల సంఘం ఈ ఈవీఎంల విషయంలో బోట్సువానా ప్రభుత్వానికి భరోసా ఇస్తోంది. ఇవి అత్యంత భద్రమైనవని హామీ ఇస్తోంది. అంతేకాదు... మనదగ్గర పెడుతున్నట్లే వీవీపీఏటీ విధానంలో పేపర్ ట్రయల్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పింది. కానీ, అక్కడి ప్రతిపక్ష నేతలు మాత్రం అరవింద్ కేజ్రీవాల్ స్ఫూర్తితో వీటిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/