Begin typing your search above and press return to search.

దిన‌క‌రన్‌ లాగే బాబును అరెస్ట్ చేయాలి

By:  Tupaki Desk   |   27 April 2017 10:42 AM GMT
దిన‌క‌రన్‌ లాగే బాబును అరెస్ట్ చేయాలి
X
అధికార తెలుగుదేశం పార్టీ ఏ అస్త్రం అయితే ఉప‌యోగించి ప్ర‌తిప‌క్ష వైసీపీని ఇర‌కాటంలో ప‌డేసిందో..అదే అంశంగా ఆధారంగా టీడీపీ ర‌థ‌సార‌థి - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును వైసీపీ ఆత్మ‌రక్ష‌ణ‌లో ప‌డేసింది. కొద్దికాలం క్రితం దివంగ‌త త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ అక్ర‌మాస్తుల కేసులోఅరెస్ట్ అయి జైలుకు వెళ్లిన స‌మ‌యంలో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ టార్గెట్‌ గా టీడీపీ విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. అక్ర‌మాస్తుల కేసులో రెండో నిందితురాలిగా ఉన్న శ‌శిక‌ళ‌కు నాలుగేళ్ల శిక్ష ప‌డితే...ల‌క్ష కోట్లు తిన్న వైఎస్ జ‌గ‌న్‌ కు ఎంత శిక్ష ప‌డాల‌ని టీడీపీ ప్ర‌శ్నించింది. అయితే ఇప్పుడు అదే త‌మిళ‌నాడు ఉదంతం ఆధారంగా వైసీపీ అనూహ్య‌మైన ఎదురుదాడి చేసింది.

వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రెండాకుల గుర్తు కోసం దినకరన్‌ లంచం ఇచ్చారని ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు అరెస్టు చేస్తే మ‌రి ఏకంగా ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్ప‌డిన చంద్ర‌బాబును ఎందుకు వ‌దిలిపెట్టార‌ని బొత్సా సూటిగా ప్ర‌శ్నించారు. దిన‌క‌ర‌న్‌ ది త‌ప్పు అయితే....చంద్ర‌బాబు చేసింది ఒప్పు ఎలా అవుతుంద‌ని ప్ర‌శ్నించారు. ``మీ ఎమ్మెల్యేని మీ రాష్ట్రంలో కొనుగోలు చేస్తుంటే మీరేం చేశారు. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసును ఎందుకు నీరుగారుస్తున్నారు. చంద్రబాబు ఆయనకు తెలిసిన టక్కుటమారపు విద్యలతో మేనేజ్‌ చేయడానికి ప్రయత్నిస్తే మీరెలా లొంగిపోతున్నారు?`` అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను బొత్సా స‌త్య‌నారాయ‌ణ ప్రశ్నించారు. ప్రజలకు చట్టాల మీద నమ్మకం కోల్పోయే పరిస్ధితులు వ్యవస్థలే తీసుకొస్తున్నాయని బొత్స అన్నారు. చంద్రబాబు దోపిడీలు - అవినీతిపై ఎవరైనా కోర్టుకు వెళితే అభివృద్ధికి ఆటంకం అని డైలాగ్‌ లు వేస్తున్నారని, అదే దోపిడీకి ఒప్పుకుంటె బ్రహ్మాండం అంటారా అని చంద్రబాబును నిలదీశారు.

రాష్ట్రంలో ప్రతి విష‌యంలో లాలూచీతో జరుగుతుందని, సీఎం చంద్ర‌బాబు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని బొత్స‌ మండిపడ్డారు. భావనపాడు పోర్టుకు గ్లోబల్‌ టెండర్లు ఎందుకు పిలవలేదని బొత్స ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోర్టు ఆదాయంలో 2.3 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి జరిగిన ఒప్పందాల వెనక ఉన్న లొసుగులు ఏంటో బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. నామినేషన్‌ ల ద్వారా కాంట్రాక్టులు ఇచ్చే ప్రభుత్వ దోపిడీ విధానాన్ని బొత్స ఖండించారు. విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని ప్రకటించిన తరువాత కమిషన్లు - కాంట్రాక్టులకు కక్కుర్తిపడి రాష్ట్ర ప్రభుత్వం చేజిక్కించుకుందని బొత్స‌ ఆరోపించారు. రూ. 16 వేల కోట్లున్న ప్రాజెక్టు అంచనాలను రూ. 40 వేల కోట్లకు చంద్రబాబు పెంచారని దుయ్యబట్టారు. అందులో రూ. 6 వేల కోట్ల పనులను సీఎం కార్యాలయంలో పంచాయతీలు చేసి అక్కడే కాంట్రాక్టులు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని బొత్స ప్రశ్నించారు. ఆ రూ. 6 వేల కోట్లలో దోచుకుతింటుంది, దోపిడీలు చేస్తున్నది నిజమా.. కాదా..? అని చంద్రబాబును నిలదీశారు. చంద్రబాబు ఇష్టానుసారంగా నా మాటే చెల్లుతుందనుకుంటే పొరబాటని, చేసిన తప్పులకు, దోపిడీలకు ప్రజలకు క్షమాపణ చెప్పి పరిహారం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/