Begin typing your search above and press return to search.

బొత్స వ్యాఖ్యలతో ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులా!

By:  Tupaki Desk   |   12 Oct 2019 7:16 AM GMT
బొత్స వ్యాఖ్యలతో ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులా!
X
అమరావతి విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల ప్రభావం కొనసాగుతోందని పరిశీలకులు అంటున్నారు. రాజధానిని ఒక కులం వారి ప్రయోజనాల మేరకు ఏర్పాటు చేస్తున్నారని కొన్నాళ్ల కిందట బొత్స అన్నారు. ఒక రాజ్యాంగబద్ధమైన హోదాలో - మంత్రిగా ఉన్న వారు అలా మాట్లాడకూడదు. వేరే ఎవరైనా అలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. అయితే మంత్రులు అలా మాట్లాడటం అంత గొప్ప విషయం కాదు. సమస్య ఉంటే పరిష్కరించాలి. కానీ అలా మాట్లాడకూడదు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ అదే సామాజికవర్గానికి చెందిన నేతలున్నారు. ఎమ్మెల్యేలు - మంత్రులు కూడా ఉన్నారు. అయితే అలా ఒక సామాజికవర్గం గురించి మంత్రి హోదాలో ఉన్నవారు అలా మాట్లాడటం ఎంత వరకూ సబబో బొత్సకే తెలియాలి.

ఇక రాజధానిని మారుస్తారనే అభిప్రాయాన్ని క్రియేట్ చేశారు బొత్స. దీంతో ఆ ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు - భూముల అమ్మకాలు-కొనుగోళ్లు చాలా వరకూ తగ్గిపోయాయట. దీంతో వాటి ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పడిపోయే పరిస్థితి వచ్చిందంటున్నారు.

అమరావతి రిజిస్ట్రేషన్ల నుంచి ఎంతో కొంత ఆదాయం అయితే వచ్చేది. అయితే బొత్స వ్యాఖ్యలతో ఆ ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు చాలా వరకూ మందకొడిగా అయ్యాయి. ఇక రాజధాని విషయంలో బొత్స రేపిన ఈ గందరగోళంతో అలాంటి ఇబ్బంది వచ్చింద నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సీనియర్ మంత్రి అయిన బొత్సకు అది తగదని - ఆయన తన తీరును మార్చుకోవాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.