Begin typing your search above and press return to search.

'వెంకట్రాయ' బాధితుల‌కు వైసీపీ భ‌రోసా:బొత్స‌

By:  Tupaki Desk   |   25 Jun 2018 2:53 PM GMT
వెంకట్రాయ బాధితుల‌కు వైసీపీ భ‌రోసా:బొత్స‌
X
వెంకట్రాయ చిట్‌ఫండ్ స్కాం వ‌ల్ల వేల సంఖ్య‌లో బాధితులు రోడ్డున ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఆ చిట్ ఫండ్ చేసిన న‌మ్మక ద్రోహంతో ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్న విష‌యం విదిత‌మే. అయితే, ఇంత న‌య‌వంచ‌న‌కు పాల్ప‌డ్డ వెంక‌ట్రాయ చిట్ ఫండ్ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబుపై వైసీపీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. ఆ మోస‌కారి సంస్థ ఆస్తుల వేలంలో ప్రభుత్వం ....దొడ్డిదారి వ్యవహారాలకు తెరలేపిందని మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన ఆ సంస్థ ఆస్తుల వేలాన్ని చంద్ర‌బాబు కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని....టీడీపీ నాయకుల అక్రమాలకు ఆయ‌న ద‌న్నుగా నిలుస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. అగ్రిగోల్డ్ త‌ర‌హాలోనే ...`వెంక‌ట్రాయ` ఆస్తుల‌ను అమ్మి బాధితులకు ఎందుకు ఇవ్వ‌డం లేద‌ని బొత్స ప్ర‌శ్నించారు. డీజీపీ ఉత్తర్వుల ద్వారా ఆ ఆస్తుల వేలాన్ని నిలిపివేయించ‌డంలో చంద్ర‌బాబు స‌ర్కార్ ఆంత‌ర్యం ఏమిటని బొత్స ప్ర‌శ్నించారు.

వెంకట్రాయ చిట్‌ ఫండ్‌ కుంభకోణంపై అప్పటి ప్రభుత్వం కమిటీ వేసి ఆ సంస్థ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంద‌ని బొత్స గుర్తుచేశారు. అందుకు విరుద్ధంగా ఆ ఆస్తుల‌ వేలానికి చంద్ర‌బాబు అడ్డుప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. ఆ ఆస్తుల‌ను వేలం వేయ‌కుంటే ఖాతాదారులకు డ‌బ్బు ఎవ‌రు చెల్లిస్తార‌ని ప్ర‌శ్నించారు. వెంకట్రాయ - అగ్రిగోల్డ్‌ బాధితులకు వైసీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని బొత్స‌ భరోసా ఇచ్చారు.

బీజేపీతో టీడీపీ చీక‌టి ఒప్పందంపై బొత్స మండిప‌డ్డారు. బీజేపీతో క‌టీఫ్ చెప్పామ‌ని టీడీపీ క‌ల్ల‌బొల్లి క‌బుర్లు చెబుతోంద‌ని - ఆ రెండు పార్టీల మ‌ధ్య స‌త్సంబంధాలున్నాయ‌ని ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల త‌ర్వాత త‌న‌పై కేంద్రం కేసులు పెడుతుంద‌ని చంద్ర‌బాబు మొస‌లి క‌న్నీరు కార్చార‌ని, 40 రోజులైనా ఒక్క కేసు న‌మోదు కాక‌పోవ‌డం వెనుక ఆంత‌ర్యం ఏమిట‌ని బొత్స ప్ర‌శ్నించారు. ఢిల్లీలో మోదీని క‌డిగేస్తాన‌న్న బాబు....ఆయ‌న‌కు వంగివంగి దండాలు పెట్టార‌ని...ఇపుడు తాజాగా కేంద్రానికి లేఖాస్త్రాలంటూ కొత్త నాటకాలకు చంద్ర‌బాబు తెర‌తీశార‌ని దుయ్య‌బ‌ట్టారు. వారంలో ప‌దవీకాలం ముగియ‌నున్న సంద‌ర్భంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి ప‌ర‌కాల‌తో చంద్ర‌బాబు రాజీనామా చేయించార‌ని బొత్స ఎద్దేవా చేశారు. అదే త‌ర‌హాలో టీటీడీ పాలక మండలి సభ్యురాలిగా ఉన్న మహారాష్ట్ర బీజేపీ మంత్రి భార్య రాజీనామా ఎందుకు చేయ‌లేద‌ని బొత్స సూటిగా ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు అసమర్థత, కమిషన్ల కక్కుర్తి వల్లే కడప స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకాలేదని మండిప‌డ్డారు. టీడీపీ-బీజేపీలు మిత్ర‌ప‌క్షాలుగా ఉండి ఏపీని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లాయ‌ని దుయ్య‌బ‌ట్టారు. ఈ రెండు పార్టీల డ్రామాలను ప్రజలకు తెలియజేసేందుకు ఈ నెల 30న అనంతపూర్‌లో వైసీపీ దీక్ష చేప‌ట్ట‌బోతోంద‌ని ప్ర‌క‌టించారు. విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ అధినేత జ‌గ‌న్ పిలుపు ప్ర‌కారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైసీసీ దీక్షలు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.