Begin typing your search above and press return to search.

బాబు త‌ప్పు చేశాడు..మ‌ళ్లీ మ‌ళ్లీ చేస్తూనే ఉన్నాడు

By:  Tupaki Desk   |   26 July 2017 4:14 PM GMT
బాబు త‌ప్పు చేశాడు..మ‌ళ్లీ మ‌ళ్లీ చేస్తూనే ఉన్నాడు
X
తెలుగుదేశం పార్టీ అధినేత‌ - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్పు చేశారని - ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నారని వైఎస్సార్ సీపీ నేత - మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ అన్నారు. హామీని అమలు చేయాలని కాపులంతా అడుగుతున్నారని వారందరినీ గృహనిర్బంధం చేశారని బొత్స తెలిపారు. లాఠీలతో కొట్టి.. వారిని హింసిస్తున్న...చంద్రబాబును కాపు సామాజిక వర్గం ఇంకెప్పుడూ క్షమించదని తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ``రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యమా? పోలీసు రాజ్యమా? చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? ఇది ధర్మమా?` అని బొత్స ప్ర‌శ్నించారు. అధికారంలో ఉన్న మనిషి.. ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రయత్నించాలని ఒక‌వేళ దీనికి సంబంధించి ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు తగిన సంప్రదింపులతో పరిష్కరించుకోవాలి కానీ అది చేయకుండా విభేదాలు సృష్టించి, చిచ్చు పెట్టడానికి చంద్రబాబు నానా ప్రయత్నాలు చేస్తున్నారని మండిప‌డ్డారు.

ఏపీ డీజీపీ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని బొత్స అన్నారు. తుని ఘటనలకు సంబంధించి దర్యాప్తు చేసి... బాధ్యులపై చర్యలు తీసుకోవ‌డం ఎవ్వరికీ అభ్యంతరం లేదని బొత్స తెలిపారు. అయితే అలా చేయకుండా.. దాన్ని బూచీగా చూపి మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థనే పరిహాసం చేస్తామంటే.. ప్రజలు హర్షించరని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తుని ఘటనకు ఎవరు పాల్పడ్డారో ప్రభుత్వానికి తెలుసున‌ని బొత్స అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన అదే జిల్లా మంత్రి యనమల రామకృష్ణుడు మనుషులు ఈ విధ్వంసాలకు దిగారని బొత్స ఆరోపించారు. తాజా పాదయాత్రతో తుని ఘటనను ముడిపెట్టడం సరికాదని ఆయ‌న అన్నారు. స‌మస్యను పరిష్కరించాలి కాని, జటిలం చేయకూడదని తెలిపారు. ముద్రగడ పాదయాత్ర వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ ఉందని చెప్తున్న ప్రభుత్వం... ముద్రగడ దీక్ష విరమింప చేయడానికి ఎవరెవర్ని పంపారో మరిచిపోయారా అని బొత్స ప్ర‌శ్నించారు. ఆరోజు చర్చించిన కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, బొడ్డు భాస్కర రామారావు ఎక్కడకు వెళ్లారు? ఆరోజు మీరు ఏం విషయాలమీద చర్చించారు? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు.

కాపు సామాజిక వర్గమే కాదు అన్ని వర్గాలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. ఎమర్జెన్సీని తలపించేలా వ్యవహరిస్తున్నార‌ని ఆక్షేపించారు. కిర్లంపూడి నుంచి అమరావతికి పాదయాత్రగా వచ్చే సరికి సుమారు 10 రోజులు పైనే పడుతుందని అలాంట‌ప్పుడు ఇప్పుడే అమరావతికి కంచెలు వేయాలా అని ఆయ‌న నిల‌దీశారు. చిరకాలం అధికారంలో ఉండిపోతానని చంద్రబాబు అనుకుంటున్నారని బొత్స ఎద్దేవా చేశారు. బాబు తీరును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు హర్షించరని...ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? అని ఎదురుచూస్తున్నారని తెలిపారు. చంద్రబాబు చేస్తున్నది ముమ్మాటికీ తప్ప‌ని ఎప్పటికీ చరిత్ర ఆయన్ని క్షమించదని బొత్స తెలిపారు.

నంద్యాలలో కూడా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బొత్స ఆరోపించారు. డబ్బు మదంతో ఎన్నికలు గెలవాలని ప్రయత్నిస్తున్నారని విమ‌ర్శించారు. కరెంటు లేదన్నందుకు అహంకారంతో ఓ పౌరుడి మీద సీఎం విరుచుకుపడ్డారని బొత్స గుర్తు చేశారు. ప్రశ్నించినందుకు అరెస్టులు చేయమని అంటారా అని ఆయ‌న నిల‌దీశారు. ఇష్టం వచ్చినట్టు ఎలా ప్రవర్తిస్తారనే విష‌యం నంద్యాల ప్రజలు గుర్తించాలని కోరారు. వీళ్ల తలబిరుసుతనం వచ్చే రోజుల్లో ఎలా ఉంటుందో అర్థంచేసుకోవాల‌న్నారు.