Begin typing your search above and press return to search.

ఆఫీసు పక్కనే అతిసార..ఇదేనా రియల్‌ టైం గవర్నెన్స్ బాబూ?

By:  Tupaki Desk   |   13 March 2018 2:18 PM GMT
ఆఫీసు పక్కనే అతిసార..ఇదేనా రియల్‌ టైం గవర్నెన్స్ బాబూ?
X
గుంటూరులో అతిసార కారణంగా ఏకంగా పది మంది మరణించడంతో పాటు ఇంకా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసుపత్రి పాలవడం ఏపీలో సంచలనంగా మారింది. దీంతో విపక్షమే కాకుండా స్వపక్షం నుంచీ విమర్శలొస్తున్నాయి. రియల్ టైం గవర్నెన్సు పేరుతో అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు చీమ చిటుక్కుమన్నా తనకు తెలిసిపోతుందని చెప్పే చంద్రబాబు రాజధాని పక్కనే పది మంది పేదలు చనిపోయినా తెలుసుకోలేకపోయారన్న విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో విపక్ష వైసీపీ నేతలే కాకుండా టీడీపీ నేతలూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తచూపుతున్నారు.

అతిసారంతో 10 మంది చనిపోయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, అసలు ఏపీలో ప్రభుత్వం ఉందా? లేదా? అనే అనుమానం వస్తోందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ సంఘటనలో కింది స్థాయి అధికారులను బలిపశువులను చేయడం కాదని - ప్రభుత్వంలో ఉన్నవారు బాధ్యత వహించాలన్నారు. సీఎం - మంత్రులు - కార్యదర్శులు ఉండే ప్రాంతాల్లో అతిసార వ్యాధి ప్రబలినా ప్రభుత్వం పట్టించుకోదా? ఎంత సేపూ ఎమ్మెల్యేల కొనుగోళ్ల గురించేనా ఆలోచించేది? ప్రజా సమస్యలు ప్రభుత్వానికి పట్టవా? అని బొత్స ప్రశ్నించారు.

మరోవైపు టీడీపీకే చెందిన ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కూడా దీనిపై స్పందించారు. అతిసారం నివారణలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం, అధికారులు సరైన సమయంలో స్పందించి ఉంటే కొందరైనా ప్రాణాలతో బయటపడేవారని వ్యాఖ్యానించారు. రాజధానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరులోనే అతిసారంతో చనిపోవడం దారుణమన్నారు. దీనిపై అసెంబ్లీలో కనీస ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.