Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు వంద‌మంది కెల్విన్‌ ల‌తో స‌మానం

By:  Tupaki Desk   |   22 July 2017 5:57 PM GMT
చంద్ర‌బాబు వంద‌మంది కెల్విన్‌ ల‌తో స‌మానం
X
నంద్యాల ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప‌ర్య‌ట‌నపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘ‌టుగా స్పందించింది. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి మూడు సంవత్సరాలు దాటిపోయిన అనంతరం నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఆ పార్టీకి పట్టణ ప్రజలపై అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకువచ్చిందని, దీంతో అభివృద్ధి పనులకు జారీ చేస్తున్న జీఓలు ప్రజలను మోసగించడానికేనని వైసీపీ సీనియ‌ర్ నేత‌ - మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ ఆరోపించారు. నంద్యాల పట్టణంలోని శిల్పా స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నంద్యాల అభివృద్ధికి విడుదల చేస్తున్న జీఓలు లోపభుయిష్టంగా ఉన్నాయని, వీటిని నమ్మి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే గెలుపొందిన అనంతరం అభివృద్ధి అకస్మాత్తుగా కుంటుపడుతుందన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబద్దాల పుట్టగా మారిపోయాడని, ప్రతీది ప్రజలను మోసగించేందుకే వాగ్దానాలు ఇబ్బడి ముబ్బడిగా ఇస్తున్నాడని, మాయల మరాఠికంటే గొప్ప మేథావి చంద్ర‌బాబు అని బొత్స మండిప‌డ్డారు. సీఎం చంద్రబాబునాయుడు దోపిడీ ముఠా నాయకుడు అని, ఆయన మంత్రులు దోపిడీ దొంగలు అని తీవ్రంగా ఆరోపించారు. గృహ నిర్మాణంలో భారీ దోపిడీకి పథకం రచించారన్నారు. నంద్యాల లాంటి పట్టణంలో గృహ నిర్మాణం చేపట్టాలంటే చదరపు అడుగుకు 13 నుండి రూ.1500 వరకు తీసుకుంటారని, అయితే ప్రభుత్వం నిర్మిస్తున్న అపార్టుమెంట్లకు చ.అ.కు రూ.2300లు తీసుకొనేందుకు ఒప్పందం చేసుకొని గుత్తేదారుల నుండి భారీ మొత్తంలో వసూలు చేసేందుకే గృహ నిర్మాణం చేపట్టి ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. 13 వేల మంది నిరుపేదల నుండి రూ.400 కోట్లు దోచుకొనేందుకు పక్కాగా పథకాన్ని రూపొందించారని అన్నారు. పట్టిసీమ ద్వారా భారీగా దోచుకున్నారని, విశాఖలో భూదందా ద్వారా దోపిడీ చేసింది చాలక రాజధాని లోను భారీగా దోచుకుంటున్నారని, తాత్కాలిక సచివాలయం నిర్మించి అందులో కూడా దోపిడి పర్వానికి తెరతీసిన ఘనత చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. చంద్రబాబునాయుడు ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా అందులో నుండి కొంత దోచుకొని దాచుకుంటున్నారని బొత్స ఆరోపించారు.

నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన మూడు సంవత్సరాల అనంతరం నంద్యాలలో రోడ్ల విస్తరణ చేయాలని ఆఘమేఘాల మీద దుకాణాలను కూలగొట్టడం అన్యాయమని మండిప‌డ్డారు. దుకాణాదారులకు నష్టపరిహారం చెల్లించిన అనంతరమే రోడ్ల విస్తరణ ప్రారంభించాలని హితవు పలికారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా సంఘాలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి వారికి మొండి చేయి చూపించి నంద్యాలకు వచ్చి ఏ మొఖం పెట్టుకొని పొదుపు సంఘాలతో సమావేశం అవుతున్నారని కాకాని ప్రశ్నించారు. విశాఖపట్నంలో హుదుద్ తుఫాన్ అనంతరం భారీగా టిడిపి దోచుకుందని, ఆ కారణం చూపించి రికార్డులను మాయం చేసి భారీ భూదందాకు తెరతీశారని, అన్నారు. హుదుద్ తుఫాన్ ద్వారా తెలుగుదేశం పార్టీ రెండు విధాలుగా దోచుకొని భారీగా లబ్ధి పొందిందన్నారు.

మాదకద్రవ్యాలను సరఫరా చేసే కెల్విన్‌తో చంద్రబాబును పోల్చుతూ లక్షమంది కెల్విన్‌లతో చంద్రబాబు సమానమని కాకాని వ్యాఖ్యానించారు. . తమ జిల్లాకు చెందిన వ్య‌వ‌సాయ‌ మంత్రి నాలుగు సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనా దొడ్డిదారిన ఎమ్మెల్సీగా వచ్చి మంత్రి పదవి దక్కించుకొని పసుపు కుంభకోణంలో కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నారన్నారు. విద్యార్థులతో కాపీలు కొట్టించే నారాయణ నీతులు చెబితే ప్రజలు నమ్మరన్నారు. ఎలాగైనా నంద్యాల సీటును కైవసం చేసుకొనేందుకు అధికార తెలుగుదేశం పార్టీ కుట్ర పన్నుతుందని ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ ప్లీనరీ సమావేశంలో అభివృద్ధి, సంక్షేమ పేరిట నవరత్నాలను ప్రకటించారని కాకాని గోవ‌ర్ద‌న్ రెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది, ఆ నవరత్నాల్లాంటి పథకాలను రాష్ట్రంలో అమలు చేసి ఆయన తండ్రి రాజశేఖర్‌రెడ్డి స్వర్ణ యుగాన్ని తలపించేలా అభివృద్ధి చేస్తారని, అందుకే నంద్యాలలో వైకాపా అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.