Begin typing your search above and press return to search.

వరదల గురించి మాట్లాడితే మరీ ఇంతలా వక్రీకరిస్తారా?

By:  Tupaki Desk   |   24 Aug 2019 6:10 AM GMT
వరదల గురించి మాట్లాడితే మరీ ఇంతలా వక్రీకరిస్తారా?
X
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు కోపం వచ్చేసింది. తాను చేసిన వ్యాఖ్యలపై జరుగుతున్న రగడపై ఆయన తాజాగా రియాక్ట్ అయ్యారు. తాను ప్రస్తావించిన విషయానికి సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా సాగుతున్న ప్రచారంపై ఆయన మండిపడుతున్నారు. ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి తాను వరదల గురించి మాట్లాడితే.. విషయాన్ని వక్రీకరించి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు రాసుకుంటున్నారన్నారు.

ఏపీ రాజధాని అమరావతి ఉంటుందా? ఉండదా? అన్న విషయం మీద తాను అస్సలు మాట్లాడలేదని.. తాను కేవలం రాజధాని ఏర్పాటుకు సంబంధించి శివరామకృష్ణన్ రిపోర్టుని పరిగణలోకి తీసుకోమని కేంద్రం చెబితే.. చంద్రబాబు అప్పటి మంత్రి నారాయణ నివేదికను పరిగణలోకి తీసుకొని అమరావతిని ఏపీ రాజధానిగా ఎంపిక చేశారని చెప్పారు.

పదేళ్ల క్రితం 11.5లక్షల క్యూసెక్కుల వరదతో అమరావతి ప్రాంతం అతలాకుతలమైందని.. తాజాగా 8.5లక్షల క్యూసెక్కుల వరదతో రాజధాని ప్రాంతం మునిగిన వైనాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో రాజధానిలో వరద గురించి తాను మాట్లాడితే.. రాజధానిని తరలిస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేసుకుంటూ వార్తలు రాశారన్నారు. తాను వాస్తవాలు మాట్లాడితే.. చంద్రబాబు మాత్రం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మాట్లాడారన్నారు.

అమరావతి చుట్టూ భూములు కొన్నది చంద్రబాబు బినామీలేనని.. ధరలు తగ్గిపోతున్నాయి కాబట్టి ప్రస్తుతం వారికి భయం పట్టుకుందన్నారు. చెన్నై.. ముంబయిలు ఎప్పుడో కట్టిన రాజధానులని.. ముంపునకు గురవుతుందని తెలిస్తే.. చెన్నై.. ముంబయిలను మునిగిపోయే ప్రాంతంలో కట్టేవారు కాదన్నారు. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని.. దీంతో రూ.25లక్షల కోట్ల సంపదను క్రియేట్ చేయనున్నట్లుగా బొత్స చెప్పారు. అంతాబాగానే ఉంది కానీ.. చెన్నై.. ముంబయిలను వరదలో మునిగిపోయే ప్రాంతాల్లో నిర్మించలేదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యంతో.. కబ్జాలతో ప్రాంతాలు కుంచించుకుపోయి.. వర్షం పడితే వాన నీరు పోక లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్న వైనాన్ని ఆయన ఎందుకు మిస్ అవుతున్నట్లు?