Begin typing your search above and press return to search.

ఇద్దరు రాజులతో బొత్స యుద్ధం

By:  Tupaki Desk   |   26 Jun 2017 4:19 PM GMT
ఇద్దరు రాజులతో బొత్స యుద్ధం
X
విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆ జిల్లాకు చెందిన ఇద్దరు రాజులతో తలపడుతున్నారు. రాష్ర్టంలో ఒకరు - కేంద్రంలో ఒకరు మంత్రులుగా ఉన్నా కూడా విజయనగరం జిల్లాకు వీసమెత్తు కూడా పనిచేయడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి - విజయనగరం రాజు అశోక్ గజపతికి అండగా నిలుస్తూ రాష్ర్ట మంత్రి, బొబ్బిలి రాజు సుజయ కృష్ణ రంగారావు బొత్సపై ప్రత్యారోపణలు చేస్తున్నారు. దీంతో కొద్దిరోజులుగా విజయనగరం రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి.

మంత్రి రంగారావు నిజమైన రాజవంశీకుడైతే ఏ పార్టీ జెండాతో ఎమ్మెల్యేగా గెలిచారో ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు సిద్ధమవ్వాలని బొత్స డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలోని ఇద్దరు మహారాజులకు మంత్రి పదవులిస్తే వారి ఆస్తులు కాపాడుకునేందుకు పాకులాడుతున్నారంటూ బొత్స అటు రంగారవు - ఇటు అశోక్ లపై మండిపడుతున్నారు. రాజులిద్దరికీ రైతు, సామాన్య కుటుంబాల కష్టాలు తెలియవన్నారు.

అంతేకాదు... నీతి మంతులమన్న ముసుగులో దోపిడీ వ్యవహారాలకు పాల్పడుతున్నారంటూ ఆయన పరోక్ష ఆరోపణలు చేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేస్తాననని చెప్పి... మాన్సాస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేందుకు పావులు కదిపి... చివరికి మెడికల్‌ కళాశాల రాకుండా చేయడమేనా రాజనీతి అంటూ ఆయన ఇటీవల అశోక్‌ గజపతిని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా అశోక్ ఇప్పటివరకూ జిల్లాకు చేసిందేమీ లేదంటూ ఆయన పదేపదే ఏకిపడేస్తున్నారు. ప్రతిసారీ తనపై ఆరోపణలు చేస్తున్న ఇద్దరు మంత్రులు తన అవినీతి, అక్రమాలను నిరూపించగలిగితే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ విసిరారు.

అయితే... దీనిపై అశోక్ స్పందించకపోయినా రంగారావు మాత్రం స్పందించారు. బొత్సపై తాము చేసిన ఆరోపణలన్నీ నిరూపిస్తామని అయన అంటున్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చే విధంగా ఏ అంశం మీద విచారణ జరిగిందో ఆ రికార్డులను కాల్చేసిన విషయం ప్రజలు మరచిపోలేదని అన్నారు. తనకు రిమోట్ కంట్రోల్ రాజకీయాలు చేతకాదన్నారు. ఏ బినామీలను అడ్డం పెట్టుకొని బొత్స అవినీతికి పాల్పడ్డారో, ఆ నిజాలు దర్యాప్తులో బయటకు వస్తాయని ఆయన అంటున్నారు. ఇప్పటికే ఆయా ఆరోపణలపై దర్యాప్తు పూర్తయ్యిందన్నారు. బొత్సతోపాటు మిగిలిన నేతల చరిత్ర కూడా బయటకు వస్తుందంటున్నారు.

అంతేకాదు.... ఒకప్పటి తమ వంశపారంపర్య శత్రువులైన విజయనగర వంశానికి చెందిన కేంద్ర మంత్రి అశోక్ ను కూడా ఆయన వెనుకేసుకొచ్చారు. నిజాయితీగా ఉన్న కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుపై కూడా బొత్స అవినీతి ఆరోపణలు చేయడం కరెక్టు కాదని రంగారావు అంటున్నారు.

ఇద్దరు రాజులూ అధికారంలో ఉండడంతో టీడీపీని ఎదుర్కోవడం ఎలాగా అని వైసీపీ స్థానిక నేతలు కాస్త టెన్షన్ పడుతున్న సమయంలో బొత్స లీడ్ చేస్తూ దూకుడు పెంచుతుండడంతో వైసీపీ వర్గాలు ఉత్సాహంగా ఉన్నాయి. అయితే... రంగారవు కూడా తన సహజ శైలి నుంచి బయటపడి దూకుడు పెంచడంతో మాటల యుద్ధాలు పెరుగుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/