Begin typing your search above and press return to search.

బొత్స ప్రకటనతో కోట్లకు పడగలెత్తిన దొనకొండ రైతులు!

By:  Tupaki Desk   |   21 Aug 2019 10:14 AM GMT
బొత్స ప్రకటనతో కోట్లకు పడగలెత్తిన దొనకొండ రైతులు!
X
'రాజధాని విషయంలో ప్రభుత్వం త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటుంది..' అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనతో ప్రకంకపనలే పుడుతూ ఉన్నాయి. అమరావతిని రాజధానిగా రద్దు చేయబోతున్నట్టుగా సత్తిబాబు ఏం చెప్పనప్పటికీ సమీకరణాలు మాత్రం వేగంగా మారిపోతూ ఉన్నాయి. అప్పుడే అమరావతి ని రాజధానిగా రద్దు చేసేసినట్టుగా ముందుగా తెలుగుదేశం నేతలే మాట్లాడుతూ ఉన్నారు. మరోవైపు బొత్స ప్రకటనకు పెడార్థాలు తీయవద్దంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రకటించారు. ఈ విషయంలో మిగతా పార్టీలు కూడా తలా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాయి.

ఇలాంటి నేపథ్యంలో రియల్టర్లు మాత్రం ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చేసినట్టుగా ఉన్నాయి. అప్పుడే కార్లు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం పరిధిలోని దొనకొండ ప్రాంతం వైపు మళ్లాయని తెలుస్తోంది. రియలెస్టేట్ వ్యాపారులు తమ కార్లను అమరావతి వైపు నుంచి దొనకొండ వైపు మళ్లించినట్టుగా తెలుస్తోంది. అక్కడ భూముల కొనుగోలు అప్పుడే ఊపందుకుంటోందని సమాచారం.

రాత్రికి రాత్రి భూములకు యమ డిమాండ్ పెరగడంతో పాటు, వాటి ధరలు కూడా కోట్ల రూపాయలకు చేరిపోతున్నట్టుగా సమాచారం. జగన్ వస్తే రాజధానిని దొనకొండకు మారుస్తారు అనే ప్రచారం మొదటి నుంచి ఉంది. అయితే రాజధానిని మార్చే ఉద్దేశం లేదని జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ప్రకటించారు. అదే విషయాన్ని ఇప్పుడూ చెబుతూ ఉన్నారు. అయితే ఇటీవల వచ్చిన కృష్ణా నది వరదలు అమరావతి ప్రాంతంలో భద్రతను ప్రశ్నార్థం చేశాయి. చంద్రబాబు నాయుడు ఇంటినే వరద చుట్టుముట్టిన వైనాన్ని అంతా గమనించారు.

కృష్ణా నదికి మాత్రమే వరదలు వచ్చాయి. అయితే ఇదే సమయంలో స్థానిక వాగువంకలు పొర్లి ఉంటే - స్థానికంగా కూడా భారీ వర్షాలు కురిసి ఉంటే అమరావతి పూర్తిగా నీటమునిగేదనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో రాజధాని గురించి తమ విధానాన్ని ప్రకటించబోతున్నట్టుగా మంత్రి బొత్స ప్రకటించారు. ఈ పరిణామాల్లో అమరావతికి ఎంతో కొంత ప్రాధాన్యత తగ్గిపోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఎన్నికలకు ముందు నుంచినే అమరావతిలో రియల్ బూమ్ ఢామ్ అనే పరిస్థితి. ప్రస్తుత పరిణామాల్లో ఆ బూమ్ దొనకొండ ప్రాంతంలో చెలరేగుతూ ఉండటం గమనార్హం!