Begin typing your search above and press return to search.

బొత్స రాజ‌కీయ స‌న్యాసం..కానీ ఒక్క ష‌ర‌తు

By:  Tupaki Desk   |   19 Jun 2017 4:37 PM GMT
బొత్స రాజ‌కీయ స‌న్యాసం..కానీ ఒక్క ష‌ర‌తు
X
తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ సంచ‌ల‌నమైన స‌వాల్ విసిరారు. తాను రాజ‌కీయాల నుంచి విరమించుకునేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని దీనికి ఏపీ సీఎం సిద్ధంగా ఉన్నారా అని ప్ర‌శ్నించారు. ఇంత‌కీ ఎందుకు బొత్స ఇంత‌లా ఫైర్ అయ్యారంటే... విశాఖ భూ కుంభకోణంలో బొత్స బ్రదర్స్‌ పేరును టీడీపీ నేత‌లు ప్ర‌స్తావించ‌డ‌మే! అధికార పార్టీ విమ‌ర్శ‌ల‌పై స్పందించిన బొత్స హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌ లోని వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తప్పుడు ఆరోపణలు చేసి టీడీపీ భూదందాలపై మాట్లాడకుండా నోరు నొక్కుదామనే కుట్రలు పన్నుతున్నారని, కానీ ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేవాడిని కాదన్నారు.

భూ కుంభ‌కోణాల్లో తాను, త‌న సోద‌రుడి పాత్ర ఉంటే తలదించుకొని రాజకీయాలకు స్వస్తి చెబుతానని బొత్స సంచల‌న ప్ర‌క‌ట‌న చేశారు. చంద్ర‌బాబువ‌లే పిరికిపందల్లా స్టేలు తెచ్చుకోవడం త‌మ‌ రక్తంలోనే లేదని ధ్వజమెత్తారు. దమ్ముంటే భూ కుంభకోణాలపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. భూస్కాంల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ హస్తం లేకపోతే సీబీఐ ఎంక్వైరీ వేయడానికి ఎందుకు జంకుతున్నారని బొత్స ప్రశ్నించారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏ రకంగా సీబీఐ ఎంక్వైరీ వేసి వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పారో.. ఆ రకంగా చంద్రబాబు కూడా చేయాలన్నారు. దస్‌పల్లా భూములు ఎక్స్‌ పార్టీ అయిపోయిందని జిల్లా కలెక్టర్‌ చెప్పడం పెద్ద జోక్‌ గా ఉందన్నారు. కలెక్టర్‌కు ప్రభుత్వ ఆస్తులు కాపాడే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో డబ్బు సంచులు మోసినవారికి చంద్రబాబు కనుసన్నల్లో దస్‌ పల్లా భూములు దోచిపెట్టారని విమర్శించారు. భూదందాలపై సీబీఐ ఎంక్వైరీ వేస్తే ఆధారాలతో సహా నిరూపిస్తామని బొత్స స్పష్టం చేశారు.

విశాఖ‌లో భూ కుంభ‌కోణంపై సీబీఐ విచారణ వేస్తేనే న్యాయం జరుగుతుంది తప్ప సిట్‌ వల్ల ఉపయోగం లేదని బొత్స అన్నారు. అధికార పార్టీ పెద్దలు సిట్‌ అంటే అక్కడ కూర్చోవడమే తప్ప న్యాయం జరగదన్నారు. మళ్లీ దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లుగా అధికారులను సిట్‌ లో ఇన్వాల్వ్‌ చేస్తే ప్రయోజనం ఏముంటుందన్నారు. 233 గ్రామాల్లో ఉన్న లక్ష ఎకరాలకు సంబంధించిన ఎఫ్‌ ఎంబీలు, 400 రిజిస్టర్‌లు,3 లక్షల అడంగల్‌ కాపీలు కనిపించడం లేదని అధికారులే చెబుతున్నారని ఇంకా నిజాలు ఎలా తేలుతాయ‌ని ప్ర‌శ్నించారు. రెండు గ్రామాల్లో 270 ఎకరాలే కాదు.. ఆనందపురం - పద్మనాభం - పెందుర్తి - అనకాపల్లి రూరల్‌ తో పాటు విశాఖ సెక్యూరిటీ హౌస్‌ పక్కన గజం రూ. లక్ష విలువ చేసే దస్‌పల్లా భూములను కూడ అన్యాయక్రాంతంగా దోచుకున్నారని బొత్స‌ విమర్శించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి పొలంలో ఎ్రరచందనం దుంగలు దొరికినప్పుడు సిట్‌ విచారణ వేస్తే ఏం జరిగిందో ప్రజానీకానికి తెలియదా అని ప్రశ్నించారు. కాబట్టి ఇటువంటి కంటితుడుపు చర్యలతో ప్రజల కన్నుగప్పే ప్రయత్నం చేయోద్దని ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరించారు. విశాఖ భూ కుంభకోణాలపై ఈనెల 22వ తేదీన జిల్లా కలెక్టరేట్‌ వద్ద వైఎస్‌ఆర్‌ సీపీ మహాధర్నాను నిర్వహిస్తుందని బొత్స తెలిపారు. ఈ మహాధర్నాలో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తారన్నారు. అఖిలపక్ష నేతలు హాజరై ధర్నాను విజయవంతం చేయాలని బొత్స కోరారు. ఇప్పటికే ప్రభుత్వ మిత్రపక్షమైన బీజేపీ కూడా భూదందాలపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్‌ చేస్తుందన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/