బాబుపై బొత్స బాంబు పేలిందే!

Tue Apr 17 2018 15:58:57 GMT+0530 (IST)


టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు - ఆయన కుమారుడు నారా లోకేశ్ లకు టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు - తమిళనాడు కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డితో ఉన్న సంబంధాల గురించి ఇప్పుడు షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఇటీవలే గుంటూరు  జిల్లాలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభా వేదిక మీద నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్... నారా ఫ్యామిలీపై సంచలన ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దు సమయంలో జనం కరెన్సీ కోసం నానా పాట్లు పడుతూ ఉంటే... శేఖర్ రెడ్డి మాత్రం కొత్తగా వచ్చిన రూ.2వేల నోట్ల కట్టలను అట్ట పెట్టేల్లో దాచేసి అడ్డంగా దిరికొపోయిన విషయం తెలిసిందే. నాడు ఈ విషయం పెద్ద సంచలనం కాగా... మొన్న ఆ శేఖర్ రెడ్డితో నారా లోకేశ్ కు ప్రత్యక్ష సంబంధాలున్నాయని పవన్ కల్యాణ్ ఆరోపించారు. అంతేకాకుండా శేఖర్ రెడ్డి అవినీతిలో నారా లోకేశ్ కు పాత్ర ఉందని కూడా పవన్ మరింత ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జనం అనుకుంటున్న ఈ విషయాన్ని తాను బహిరంగ వేదిక మీద చెబుతున్నానని పేర్కొన్న పవన్.. అసలు తన కుమారుడు అవినీతికి పాల్పడుతున్నారన్న విషయం చంద్రబాబుకు తెలియదా? అని కూడా ప్రశ్నించారు.మొత్తంగా నారా ఫ్యామిలీపై ఇప్పటిదాకా ఎవరూ చేయని విధంగా సంచలన ఆరోపణలు గుప్పించిన పవన్... చంద్రబాబు లోకేశ్ లను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిన సంగతి కూడా తెలిసిందే. ఆ తర్వాత లోకేశ్ కాకుండా శేఖర్ రెడ్డి బయటకు వచ్చి తనకు లోకేశ్ తో ఎలాంటి సంబంధాలు లేవని ప్రకటించడం ఆధారాలుంటే చూపాలని టీడీపీ నేతలు డిమాండ్ చేయడంతో మరోమారు రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్... అవినీతి చేసేటప్పుడు పత్రాలు రాసిచ్చుకుంటారా? అంటూ తనదైన శైలి విమర్శలు గుప్పించారు. మొత్తంగా పవన్ ఆరోపణలతో ఆత్మరక్షణలోనే పడినట్టుగా భావన కనిపించగా... ఆ తర్వాత ఈ విషయాన్ని మరెవరూ ప్రస్తావించకపోవడంతో అది గతించిన అంశంగానే అంతా అనుకున్నారు. అయితే ఆ విషయాన్ని వైసీపీ కీలక నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోమారు తెర మీదకు తీసుకొచ్చారనే చెప్పాలి. ఇటీవలే ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశాన్ని ప్రస్తావించిన బొత్స... శేఖర్ రెడ్డితో నారా ఫ్యామిలీకి ప్రత్యక్ష సంబంధాలున్నాయని చెప్పేందుకు తన వద్ద ఆధారాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కల్యాణ్ ఆరోపణల తర్వాత దీనిపై తాను దృష్టి సారించానని ఈ క్రమంలో బాబు ఫ్యామిలీ శేఖర్ రెడ్డిల మధ్య సంబంధాలకు పక్కా ఆధారాలు లభించాయని ఆయన చెప్పుకొచ్చారు. పెద్ద నోట్ల రద్దు సందర్భంగా చంద్రబాబు తన ద్వారా రూ.500 కోట్ల బ్లాక్ మనీని మార్చుకున్నారని శేఖర్ రెడ్డి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చినట్లు బొత్స ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ సీబీఐ నివేదిక బయట పడితే చంద్రబాబుతో శేఖర్ రెడ్డి కి ఉన్న లింకేంటనేది బయటపడిపోతుందని కూడా ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో శేఖర్ రెడ్డికి ఉన్న చీకటి సంబంధం వ్యవహారాన్నిజనంలోకి తీసుకెళ్తామని బొత్స ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మొత్తంగా నారా ఫ్యామిలీ శేఖర్ రెడ్డిల మధ్య చీకటి ఒప్పందాలకు సంబంధించిన అంశాన్ని జనం మరిచిపోతున్న సమయంలో బొత్స ఈ విషయాన్ని మరోమారు తెరపైకి తీసుకువచ్చి సంచలనమే రేపారని చెప్పాలి. బొత్స పేల్చిన ఈ బాంబుకు బాబు ఫ్యామిలీ టీడీపీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.