Begin typing your search above and press return to search.

చర్లపల్లే అడ్డా: నాడు ఖైదీ.. నేడు మేయర్

By:  Tupaki Desk   |   11 Feb 2016 5:01 AM GMT
చర్లపల్లే అడ్డా: నాడు ఖైదీ..  నేడు మేయర్
X
గ్రేటర్ పీఠం మీద కూర్చునే నేత ఎవరన్నది తేలిపోయింది. వ్యక్తిగత ఇష్టాయిష్టాల కంటే కూడా.. పార్టీ కోసం మొదట్నించి కష్టపడిన నేతకే కీలక పదవులన్న భావన కలిగించేలా తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ మేయర్ అంశంపై నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ ఎస్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బొంతు రామ్మోహన్ ను మేయర్ గా ఎంపిక చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన బొంతుకు సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా కనిపిస్తాయి.

ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించిన ఆయనపై 142 కేసులు నమోదు అయ్యాయి. దాదాపు నాలుగు నెలలు చర్లపల్లి జైల్లో కాలం గడిపారు. మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. ఆయన ఏ జైలులో అయితే ఖైదీగా ఉన్నారో.. ఇప్పుడు అదే జైలున్న చర్లపల్లి నుంచి కార్పొరేటర్ గా బొంతు ఎన్నిక అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన ఆయన గ్రేటర్ ఎన్నికల బరిలో దిగాలని అస్సలు అనుకోలేదు. చివరి నిమిషంలో పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రేటర్ బరిలోకి దిగిన ఆయన కార్పొరేటర్ గా విజయం సాధించటమే కాదు.. ఇప్పుడు ఏకంగా మహానగర ప్రధమ పౌరుడిగా అవతరించనున్నారు. ఉస్మానియా వర్సిటీలో ఎల్ ఎల్ బీ పూర్తి చేసిన బొంతు.. ఇప్పుడు అదే వర్సటీలో తన పీహెచ్ డీని సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో మేయర్ గా పదవిని చేపట్టనున్న నేత.. ఉన్నత విద్యను అభ్యసించి ఉండటమే కాదు.. యువకుడై ఉండటం గమనార్హం.

గ్రేటర్ లో డిప్యూటీ మేయర్ గా పదవిని చేపట్టనున్న బాబా ఫసియుద్దీన్ విషయానికి వస్తే.. 34 ఏళ్ల వయసులోనే ఆయనీ పదవిని చేపట్టనున్నారు. మైనార్టీ నేత కావటం.. విద్యార్థి నాయకుడిగా పార్టీలో సుపరిచితుడైన ఫసియుద్దీన్ బోరబండ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. డిప్యూటీ పదవిని మైనార్టీకి ఇవ్వాలన్న నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకోవటంతో ఆయనిప్పుడు డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.