Begin typing your search above and press return to search.

బోండా సంచ‌ల‌నం... టీడీపీ ఓట‌మికి వారే కార‌ణ‌మ‌ట‌

By:  Tupaki Desk   |   24 Jun 2019 9:46 AM GMT
బోండా సంచ‌ల‌నం... టీడీపీ ఓట‌మికి వారే కార‌ణ‌మ‌ట‌
X
అస‌లే తాజా ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభ‌వాన్ని మూట‌గ‌ట్టుకున్న టీడీపీ... ఆ పార్టీ నేత‌ల‌ను తీవ్ర డోలాయ‌మానంలో ప‌డేసింది. జనంలోకి వ‌చ్చేందుకు ఆ పార్టీ నేత‌లు స‌సేమిరా అంటున్నారు. ఎలాగోలా కొంద‌రు నేత‌లు బ‌య‌ట‌కు వ‌చ్చి టీడీపీ ప‌క్షాన మాట్లాడుతున్నా... సొంత పార్టీకి చెందిన కొంద‌రు నేత‌లు చేస్తున్న కామెంట్లు వారిని మ‌రింత‌గా ఇబ్బందికి గురి చేస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. పార్టీ ఓట‌మి నేప‌థ్యంలో పార్టీకి షాకిస్తూ న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు. అంతేకాకుండా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లంతా స‌మావేశ‌మై మ‌రింత హీట్ పుట్టించారు. ఈ భేటీకి హాజ‌రైన వారిలో ముఖ్యుడిగా భావిస్తున్న బెజ‌వాడ సెంట్ర‌ల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు తాజాగా చేసిన కామెంట్లు ఆ పార్టీలో మ‌రింత‌గా మంట పుట్టించాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఓ టీవీ ఛానెల్ కు వ‌చ్చిన ఇంట‌ర్వ్యూలో చాలా విష‌యాలే మాట్లాడిన బోండా... అస‌లు పార్టీ ఓట‌మికి కొంద‌రు మంత్రులే కార‌ణ‌మంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎలాంటి మొహ‌మాటం లేకుండా న‌ర్మ‌గ‌ర్భంగానే బోండా చేసిన ఈ కామెంట్ల‌తో టీడీపీలో ఇప్పుడు అల‌జ‌డి తారా స్థాయికి చేరింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయినా బోండా ఏమ‌న్నారంటే... పార్టీ ఓట‌మికి కొంద‌రు మంత్రులే కార‌ణ‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఆ మంత్రుల పేర్ల‌ను మాత్రం చెప్ప‌ని బోండా... వారంతా చంద్ర‌బాబును అంటిపెట్టుకుని తిరిగిన వారేన‌ని మ‌రింత సంచ‌ల‌న కామెంట్ చేశారు. క్షేత్ర‌స్థాయిలోని వాస్త‌వాల‌ను చంద్ర‌బాబుకు తెలియ‌కుండా... అంతా బాగానే ఉంద‌ని క‌ల‌రింగ్ ఇచ్చార‌ని ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ప్ర‌జాక్షేత్రంలో వ్య‌తిరేక‌త ఉంద‌ని తెలిసి ఉంటే దానిని స‌రిదిద్దుకునే య‌త్నాలు జ‌రిగి ఉండేవ‌ని, అయితే చంద్ర‌బాబుతో రాసుకుపూసుకు తిరిగిన మంత్రులు ఈ వాస్త‌వాన్ని ఆయ‌న దృష్టికి వెళ్ల‌కుండా అడ్డుకున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వీరు చేసిన ఈ పాపం కార‌ణంగానే పార్టీ ఘోర ఓట‌మిపాలైంద‌ని కూడా బోండా సంచ‌ల‌న కామెంట్లు చేశారు.

అస‌లు ప్రజ‌ల్లో పార్టీ ప‌ట్ల‌, ప్ర‌భుత్వం ప‌ట్ల ఉన్న భావ‌న‌ను అధినేత ద‌రిచేర‌నివ్వ‌కుండా స‌ద‌రు మంత్రులు వ్య‌వ‌హ‌రించార‌ని, ఈ విష‌యంలో పార్టీకి చెందిన ఇత‌ర నేత‌ల అభిప్రాయాల‌ను కూడా వారు అధినేత‌కు చేర‌కుండా అడ్డుకున్నార‌ని బోండా మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల మూడ్ లో వ‌స్తున్న మార్పులు, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా ప‌రిణామాలు పార్టీ అధినేత దృష్టికి వెళ్ల‌కుండా మ‌సిపూసి మారేడు కాయ చేసిన స‌ద‌రు మంత్రుల వ్య‌వ‌హారం కార‌ణంగానే పార్టీ ఓడిపోయింద‌ని కూడా బోండా సంచ‌ల‌న కామెంట్లు చేశారు. బోండా చేసిన ఈ కామెంట్లు టీడీపీలో మంట‌లు రేపుతుంటే... అస‌లు బోండా ప్ర‌స్తావించిన మంత్రులు ఎవర‌న్న దిశ‌గా విశ్లేష‌ణ‌లు జోరుగా సాగుతున్నాయి.