Begin typing your search above and press return to search.

వైర‌ల్: నెటిజ‌న్ vs బొండా బ్ర‌ద‌ర్‌

By:  Tupaki Desk   |   27 April 2017 5:11 AM GMT
వైర‌ల్: నెటిజ‌న్ vs బొండా బ్ర‌ద‌ర్‌
X
ఏపీలో సోష‌ల్ మీడియాపై ఆంక్ష‌లు కొన‌సాగుతున్న‌ట్లుగా స్ప‌ష్ట‌మైన సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు త‌న‌యుడు - మంత్రిగా ఇటీవ‌లే బాధ్య‌త‌లు చేప‌ట్టిన నారా లోకేశ్ ప‌లుమార్లు నాలుక మ‌డ‌తప‌డిపోయిన వైనాన్ని సోష‌ల్ మీడియా నిజంగానే ఏకిపారేసింది. నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో లోకేశ్ పై ఇష్టారాజ్యంగా సెటైర్ల మీద సెటైర్లు వేస్తూ నానా హంగామా చేశారు. గ‌తంలోనూ లోకేశ్ పై ఈ త‌ర‌హా సెటైర్లు వినిపించినా... ఇటీవ‌లి కాలంలో అవి మ‌రింత ఘాటుగా మారుతున్న వైనాన్ని ప‌సిగ‌ట్టిన ప్ర‌భుత్వం సోష‌ల్ మీడియాకు అడ్డుక‌ట్ట వేయాల‌ని రంగంలోకి దిగింది. అయితే ప్ర‌భుత్వ య‌త్నాలు ఏమాత్రం కూడా ఫ‌లించ‌లేద‌ట‌.

ఈ క్ర‌మంలో నిన్న రాత్రి సోష‌ల్ మీడియాలోకి ఎక్కేసిన ఓ వీడియో ఇప్పుడు వైర‌ల్‌ గా మారిపోయింది. స‌ద‌రు వీడియోలో ముఖాలు క‌నిపించ‌కుండా... టీడీపీకి చెందిన కీల‌క నేత‌ - ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు త‌మ్ముడు బొండా ప్ర‌కాశ్ - వైసీపీని కీర్తిస్తూ... టీడీపీని దునుమాడుతున్న ఓ నెటిజ‌న్ మ‌ధ్య జ‌రిగిన ఫోన్ సంభాష‌ణ‌లు సంచ‌ల‌నంగా మారాయి. టీడీపీ ప్ర‌తిష్ఠ దిగ‌జారేలా స‌ద‌రు నెటిజ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అగ్గిమీద గుగ్గిల‌మైన ప్ర‌కాశ్ వాయిస్ హెచ్చ‌రిక‌ల‌తోనే ఆగ‌కుండా... లాక్కొచ్చి జైల్లో ప‌డేస్తాన‌ని - చంపేస్తాన‌ని బెదిరింపుల‌కు దిగిన వైనం నిజంగానే వైర‌ల్‌ గా మారిపోయింది.

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రానికి చెందిన స‌ద‌రు నెటిజ‌న్‌... కాస్తంత సంభాష‌ణ త‌ర్వాత బొండా బ్ర‌దర్ కు దిమ్మ తిరిగే షాకిచ్చాడు. ఏం చేసుకుంటావో చేసుకో... బెజ‌వాడ‌లో మీకెంత బ‌ల‌ముందో, భీమ‌వ‌రంలో మాకూ అంతే ఉందంటూ ఆ వ్య‌క్తి చెప్పిన మాట‌కు నిజంగానే బొండా బ్ర‌ద‌ర్‌ కు నోట మాట రాలేదు. అంతేకాదండోయ్‌... స‌ద‌రు నెటిజ‌న్ విసిరిన్ స‌వాల్ తో అప్ప‌టిదాకా శివాలెత్తిన‌ట్లుగా హెచ్చ‌రిక‌లు జారీ చేసిన బొండా బ్ర‌ద‌ర్‌... ఒక్క‌సారిగా నోరు మూసేసి... ఉంటాన‌మ్మా అంటూ ఫోన్ పెట్టేసిన వైనం కూడా స్ప‌ష్టంగానే వినిపిస్తోంది. బొండా ఉమ అయితే ఏంటి? ఆయ‌న గారి త‌మ్ముడైతే నాకేంటీ? అంటూ ఆ నెటిజ‌న్ చేసిన వ్యాఖ్య‌లు... సోష‌ల్ మీడియాను నియంత్రిద్దామ‌నుకునే వారికి నిజంగానే కొరుకుడు ప‌డ‌నివిగానే చెప్పాలి. ఫేస్ బుక్ వేదిక‌గా స‌ద‌రు నెటిజ‌న్ వైసీపీ అనుకూలంగా పోస్టులు పెట్టాడ‌ని, అంతేకాకుండా టీడీపీని దిగ‌జారుస్తూ కామెంట్లు చేశాడ‌ని బొండా బ్ర‌ద‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంత‌టితో ఆగ‌ని బొండా బ్ర‌ద‌ర్‌... తాను త‌ల‌చుకుంటే బెజ‌వాడ పోలీస్ స్టేష‌న్‌ లో ఉంటావ‌ని కూడా ఆ నెటిజ‌న్‌ ను బెదిరించారు.

కాస్తంత సేపు బొండా బ్ర‌ద‌ర్‌ కు మ‌ర్యాద ఇచ్చిన ఆ నెటిజ‌న్‌... ఆ త‌ర్వాత ఒక్క‌సారిగా స్వ‌రం పెంచేసి... అస‌లు మీరెవ‌రు న‌న్ను బెదిరించ‌డానికి అంటూ ప్ర‌శ్నించ‌డంతో బొండా ప్ర‌కాశ్ కు స్వ‌రం లేకుండా పోయింది. ఓ ద‌ళిత నేత‌ను ప‌ట్టుకుని బెదిరిస్తావా? అంటూ ఆ నెటిజ‌న్ మ‌రింత గ‌ట్టిగా రిప్లై ఇవ్వ‌డంతో ఇంకాస్త ముందుకెళితే... ఇంకే ప్ర‌మాదం ముంచుకోస్తుందోన‌న్న భ‌యంతో... 'స‌ర్లే ఉంటాన‌మ్మా' అంటూ బొండా బ్ర‌ద‌ర్ ఫోన్ పెట్టేశారు. అంత‌కు ముందు 'నా ఫేస్ బుక్‌ ను ప‌ట్టుకున్న మీరు... నా అడ్రెస్ ప‌ట్టుకోలేరా? ఫేస్ బుక్ అకౌంట్‌ లోనే నా ఆధార్ కార్డు - ఇత‌ర వివ‌రాలు ఉంటాయిగా. ద‌మ్ముంటే ప‌ట్టుకోండి' అంటూ ఆ నెటిజ‌న్ స‌వాల్ విస‌ర‌డంతో బొండా బ్ర‌ద‌ర్ షాకైపోయారు. ఇప్పుడు ఈ సంభాష‌ణ‌కు చెందిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ గా మారిపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/