Begin typing your search above and press return to search.

టైం బాగోలేకపోతే టైటానిక్ లా మునిగిపోవచ్చు..

By:  Tupaki Desk   |   18 Sep 2019 8:47 AM GMT
టైం బాగోలేకపోతే టైటానిక్ లా మునిగిపోవచ్చు..
X
విహార యాత్ర కాస్తా విషాద యాత్రగా మారటం.. పదుల సంఖ్యలో ప్రాణాలు పోవటం తెలిసిందే. పాపికొండల సందర్శన కోసం బోటెక్కి గోదారిలో షికారు.. అంతులేని శోకాన్ని నింపిన సంగతి తెలిసిందే. బోటు మునిగిపోవటానికి ముందు చోటు చేసుకున్న పరిణామాలపై ప్రత్యక్ష సాక్షి దశరథం చెప్పిన మాటలు వింటే అవాక్కు అవ్వాల్సిందే.

ప్రమాదానికి గురైన బోటులో మొత్తం 72 మంది ఉన్నట్లు పోలీసులు నిర్దారించారు. ఘటన జరిగిన రోజున 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన వారంతా గల్లంతయ్యారు. అంత పెద్ద గోదారిలో గల్లంతు అంటే.. ఆశలు వదులుకోవాలన్న మాటలకు తగ్గట్లు.. వేర్వేరు ప్రాంతాల్లో నిర్జీవంగా కనిపిస్తున్నారు. ఇంత మంది ప్రాణాలు తీసిన ఈ బోటు ప్రయాణంలో ప్రమాదానికి ముందు ప్రయాణికులంతా సరదాగా ఆటపాటలతో ఎంజాయ్ చేశారు.

అవే తమకు ఆఖరు క్షణాలు అన్న విషయం బోధ పడేసరికి ప్రాణాలు పోగొట్టుకున్నారు. బోటు ప్రమాదానికి ముందు ఏం జరిగిందన్న విషయానికి ఇప్పటివరకూ పలువురు బాధితులు చెప్పిన అంశాలకు సరికొత్త అంశం దశరథం నోటి నుంచి వచ్చింది. భవన నిర్మాణ కార్మికుడిగా పని చేసే ఇతడు ఏం చెప్పాడంటే.. బోటు ఎక్కిన తర్వాత అందరిని కూర్చోబెట్టారని.. ఆటా పాటలు సాగాయని.. ప్రమాదం జరగటానికి కాస్త ముందు.. మైకులో మాట్లాడిన అనౌన్సర్.. ఇది రెండో టైటానిక్.. టైం బాగాలేకపోతే టైటానిక్ లానే మునిగిపోవచ్చన్నాడని వెల్లడించాడు.

ముందుంది ప్రమాదకరమైన ప్రాంతమని.. అది దాటితేనే గమ్యస్థానానికి సురక్షితంగా వెళ్లొచ్చన్న హెచ్చరిక చేశాడన్నారు. ఇది రెండో టైటానిక్ కాకుండా ఉండటానికి మన బోటు డ్రైవర్ ను మంచిగా నడపాలని కోరుకుందామన్న అనౌన్సర్ మాట తన చెవిలో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయన్నారు. అతడు అన్నట్లే రెండో టైటానిక్ లానే మొత్తం బోటు మునిగిపోయిందన్నాడు.

డ్యాన్సులు చేసేటప్పుడు.. ఆటలు ఆడే సమయంలో అడ్డుగా ఉన్నాయని చాలామంది సేఫ్ జాకెట్లు తీసేశారని.. పడవ మునగటానికి పది సెకన్ల ముందు బోటు ఒక్కసారిగా కంపించిందన్నాడు. ఇదే డేంజర్ జోన్.. ఎవరూ కదలకండి అంటూ అరుస్తున్నప్పుడే బోటు తిరగబడిందన్నాడు.

తాను నీటిలో పడినంతనే పైకి లేచి వెంటనే సేఫ్ జాకెట్ అందుకొని వెనుక నుంచి తిరగబడిన బోటు పైకి ఎక్కానని.. ఆ తర్వాత రెండు.. మూడు నిమిషాలకే అది పూర్తిగా మునిగిపోయిందని చెప్పాడు. దీంతో తాను నీట్లోకి దూకేశానని.. అప్పటికే అరుపులు.. కేకలు.. పెడబొబ్బలతో వాతావరణం మొత్తం మారిపోయిందన్నాడు. పరిస్థితిని గుర్తించిన మత్య్సకారులు వెంటనే స్పందించి రావటంతో తాను బతికి బయటపడినట్లు చెప్పారు.

ఇదిలా ఉంటే నీటిలో మునిగిన బోటు కచ్చులూరి వద్ద గోదారిలో 214 అడుగుల లోతులో బోటు ఉన్నట్లుగా ఎన్డీఆర్ ఎఫ్ గుర్తించింది. బోటు లోపల పరిస్థితి గుర్తించేందుకు వీలుగా అల్కార్ స్కానర్ కెమెరాతో గోదావరి అడుగున చిత్రీకరించారని.. దాన్ని విశ్లేషిస్తే.. మరిన్ని వివరాలు బయటకు వచ్చే వీలుందని చెబుతున్నారు.