పడవ మునక వెనక అంతుచిక్కని నిజాలివీ..

Wed May 16 2018 13:36:52 GMT+0530 (IST)

గోదారికి కోపమొచ్చినట్టుంది.. మొన్నీ మధ్యే పాపికొండలను కాల్చేసి తన దాహార్తి తీర్చుకున్న గోదారి నిన్న రాత్రి  34మందిని తనలో కలిపేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు.. పశ్చిమగోదావరి జిల్లా కోండ్రుకోట సమీపంలోని వాడపల్లి మధ్య గోదావరిలో లాంచీ బోల్తా పడింది. ఆ సమయంలో తీవ్రమైన ఈదురుగాలులు వీచడంతో ప్రమాదం సంభవించింది. దాదాపు 50 మందితో ప్రయాణిస్తున్న లాంచీ బోల్తా పడడంతో 40 మందికి పైగా గల్లంతయ్యారని చెబుతున్నారు. మరణాలపై మాత్రం లెక్క తేలడం లేదు..* పడవ ప్రమాదానికి కారణమేంటి.?

దాదాపు 50 మంది పెళ్లి బృందంతో పడవ ప్రయాణం మొదలైంది. అదే లాంచీ లో సిమెంట్ బస్తాలు కూడా భారీగా ఉన్నాయి. పడవ కొద్దిదూరం వెళ్లగాలే ఈదురుగాలులు - భారీ వర్షం మొదలైంది. దీంతో లాంచీలోని సిబ్బంది సిమెంట్ బస్తాలు తడిసిపోతున్నాయని లాంచీలోని మూడు గదుల్లో వేసి తలుపులు మూసివేశారు. దీంతో బరువు ఎక్కువై పోయింది లాంచీ పైన మరో అంతస్తులో దానిపైన టెంట్లు వేసి ఈ ప్రయాణికులను కూర్చోబెట్టారు. ఈదురుగాలులకు టెంట్ కూడా ఊగిపోయి లాంచీ అదుపుతప్పింది. లోపల ఉన్నవారిలో చాలామందికి ఈత వచ్చినా లాంచీ తలుపులు మూసివేయడంతో బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. లాంచీలో పిల్లలు - మహిళలు - పెద్దలు చాలా మంది మునిగిచనిపోయారు. లాంచీ పైన ఉన్న వారు 10 మంది తప్పించుకొని ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరారు. లాంచీ డ్రైవర్ ను ఇంత మందితో - సిమెంట్ బస్తాలతో వెళ్లవద్దని మొదట్లోనే చాలా మంది సూచించినా డబ్బుల కోసం తీసుకెళ్లడమే ప్రమాదానికి కారణమైందని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.

*బతికి బయటపడ్డవారితో వెలుగులోకి..

ప్రమాదంలో చిక్కుకున్న వారంతా తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గిరిజనులనే ఎక్కువమంది ఉన్నారని తెలిసింది. ప్రమాదం జరిగి ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చిన వారే పోలీసులకు  - మీడియాకు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం రెండు కొండల మధ్య ఉంది. దాదాపు రెండు తాడిచెట్ల లోతులో నీరుంది. ఆ సమయంలో ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కూడా పడింది.

*సహాయక చర్యలు

లాంచీ ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఎన్డీఆర్ ఎఫ్ - బృందాలను పంపి మృతదేహాలను వెలికి తీసే పనులు మొదలు పెట్టింది. పడవ ఆచూకీ కోసం 60మంది సుశిక్షత సిబ్బంది వెతుకుతున్నారు. పడవ నీటి అడుగున  ఇసుకలో కూరుకుపోయిందని గుర్తించారు. సిమెంట్ బస్తాల కారణంగా బయటకు రావడం లేదని తెలిసింది.

*చంద్రబాబు - జగన్ దిగ్భ్రాంతి..

పడవ ప్రమాదంపై సీఎం  చంద్రబాబు - ప్రతిపక్ష నేత జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాద బాధితులకు రక్షణ చర్యల్లో వెంటనే పాల్గొనాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలివ్వగా.. జగన్ తన పార్టీ శ్రేణులకు సహాయపడాలని సూచించారు.