Begin typing your search above and press return to search.

మాయావ‌తి ట్రాన్స్‌ జెండర్ కంటే హీనం!

By:  Tupaki Desk   |   21 Jan 2019 4:49 AM GMT
మాయావ‌తి ట్రాన్స్‌ జెండర్ కంటే హీనం!
X
రాజ‌కీయ నేత‌ల విమ‌ర్శ‌లు శృతి మించ‌తున్నాయి. ఇంకా చెప్పాలంటే....విచ‌క్ష‌ణ కోల్పోతున్నాయి. సాటి నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలతో తమ స్థాయిని దిగజార్చుకుంటున్న స్థితికి చేరుతున్నాయి. తాజాగా ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని మొగల్‌ సరాయ్ బీజేపీ ఎమ్మెల్యే సాధనాసింగ్ ఈ జాబితాలో చేరారని ప‌లువురు ఆరోపిస్తున్నారు. లక్నోలో శనివారం రాత్రి జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాధనాసింగ్ మాట్లాడుతూ.. బీఎస్పీ అధినేత్రి మాయావతిని.. ట్రాన్స్‌జెండర్ కంటే కూడా హీనం అంటూ నీచమైన వ్యాఖ్యలు చేశారు. ``మాయావతికి ఆత్మగౌరవం లేదు. తనపై దాడి చేసి, వేధించిన వారితోనే కలిసి సాగుతున్నారు. ఆ సమయంలో (1995లో) ఇంచుమించుగా ఆమెపై లైంగికదాడి జరిగింది. ద్రౌపదిపై లైంగిక వేధింపులకు దిగితే ఆమె ప్రతీకారాన్ని తీర్చుకుంది. కానీ, ఈ మహిళ (మాయావతి) మాత్రం కేవలం అధికారం కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. తనపై దాడిచేసి, అసభ్యకరంగా ప్రవర్తించిన వారితోనే జట్టు కట్టారు. మాయావతీజీ....మీ చర్యలు మహిళా లోకానికే కళంకం. మిమ్మల్ని స్త్రీ అనాలో లేకుంటే పురుషుడు అనాలో అర్థంకావడం లేదు. మీరు (మాయావతి) ట్రాన్స్‌జెండర్ కంటే కూడా హీనం`` అని పరుష పదజాలంతో విమర్శించారు.

కాగా, స‌హ‌జంగానే బీజేపీ సాధనాసింగ్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంత‌రాల వ్య‌క్త‌మ‌య్యాయి. బీఎస్పీ పార్టీ స్పందిస్తూ బీజేపీ ఎమ్మెల్య వెంటనే తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ``ఎస్పీ-బీఎస్పీ పొత్తుతో బీజేపీ నేతల ఆత్మైస్థెర్యం దెబ్బతింది. దీంతో మానసిక సమతుల్యం దెబ్బతిని నీచస్థాయికి దిగజారి వారు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారు` అని బీఎస్పీ నేత ఎస్‌ సీ మిశ్రా లక్నోలో మండిపడ్డారు. సాధనాసింగ్‌ ను ఒక మానసిక రోగిగా ఆయన అభివర్ణించారు. ఇలాంటి వారిని ఆగ్రా/రాయ్‌ బరేలీలోని పిచ్చాసుపత్రిలో చేర్పించాలని చురకలంటించారు. సాధనాసింగ్‌ పై లక్నోలో బీఎస్పీ నేతలు కేసు పెట్టారు. సాధనాసింగ్ వ్యాఖ్యలపై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యల్ని కేంద్ర మంత్రి రాందాస్ అథావలే తీవ్రంగా ఖండించారు. వ్యక్తిగత విమర్శలు హద్దులు దాటవద్దని హితవు పలికారు. సాధనాసింగ్ వ్యాఖ్యలు సిగ్గుచేటు. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ వెంటనే మాయావతికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి అని కాంగ్రెస్ అధికారప్రతినిధి ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు.

కాగా, ఎమ్మెల్యే సాధనాసింగ్ అభ్యంతరకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో చెప్పాలని నోటీసులు జారీచేయనున్నట్లు కమిషన్ చైర్మన్ రేఖా శర్మ తెలిపారు. ``ఉన్నతస్థానాల్లో ఉన్న మీలాంటి వ్యక్తుల నుంచి అభ్యంతరకర వ్యాఖ్యల్ని ఊహించలేం. మాయావతిని నిందిస్తూ మీడియాలో వచ్చిన వార్తల్ని కమిషన్ సుమోటోగా స్వీకరించింది`` అని పేర్కొన్నారు. సర్వత్రా విమర్శలతో సాధనాసింగ్ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు. త‌ను అలాంటి వ్యాఖ్య‌లు చేసి ఉండాల్సింది కాద‌న్నారు.