Begin typing your search above and press return to search.

మోడీకి సొంత ఇలాకాలో ఘోర ప‌రాభ‌వం

By:  Tupaki Desk   |   2 Dec 2015 5:58 PM IST
మోడీకి సొంత ఇలాకాలో ఘోర ప‌రాభ‌వం
X
మోడీ మాట‌కు తిరుగులేదు...ఆయ‌న‌కు ఎదురు లేదు....ఈ ప‌దం నిన్న‌టి వ‌ర‌కు ఆయ‌న‌కు చ‌క్క‌గా వ‌ర్తిస్తుంది. సాధార‌ణ ఎన్నిక‌ల్లో వ‌చ్చి తిరుగులేని మెజార్టీతో మోడీ చాలా స్ర్టాంగ్ పీఎంగా అధికారం అనుభ‌విస్తున్నారు. నిన్న‌టి వ‌ర‌కు మోడీ పాల‌న చూస్తే ప్రాంతీయ పార్టీల‌కు పూర్తిగా చెక్ పెట్టి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి దేశంలోనే బీజేపీని తిరుగులేని శ‌క్తిగా మార్చ‌ల‌న్న‌ట్టుగా కొన‌సాగింది. ఈ విష‌యంలో ప్ర‌తిప‌క్షాల‌కు సైతం మోడీ మిన‌హాయింపు ఇవ్వ‌లేదు.

అయితే దేశ రాజ‌ధాని ఢిల్లీలో కేజ్రీవాల్ దెబ్బ‌కు మోడీ కాస్త కుదేల‌య్యారు. త‌ర్వాత ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న బీహార్ ఎన్నిక‌ల్లో కూడా బీజేపీ ఘోర ప‌రాజ‌యం పాల‌వ్వ‌డంతో ఆ దెబ్బ‌కు మోడీ కాస్త దిగివ‌చ్చారు. నిన్న‌టి వ‌ర‌కు నింగి చూపులు చూస్తూ ఆకాశంలోనే తేలియాడిన మోడీ బీహార్ రిజ‌ల్ట్ త‌ర్వాత నేల‌కు దిగి వ‌చ్చారు. ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోక‌ముందే మోడీకి మ‌రో ఘోర ప‌రాజ‌యం ఎదురైంది.

మోడీ సొంత రాష్ర్టం గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీకి షాక్ తగిలింది. గత అసెంబ్లీ - పార్లమెంట్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీకి ఈ సారి స్థానిక‌ సంస్థ‌ల ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. మోడీ సొంత జిల్లా మెహ్స‌నాలో జిల్లా పరిషత్ - మున్సిపల్ కొర్పొరేషన్ లలో కాంగ్రెస్ తిరుగులేని విజ‌యం సాధించింది. రాష్ర్టంలోని ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో బీజేపీ చావు త‌ప్పి క‌న్నులొట్ట‌బోయిన చందంగా త‌న ప‌ట్టు నిలుపుకున్నా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ తిరుగులేని ఆధిక్యం ప్ర‌ద‌ర్శిస్తోంది. గుజ‌రాత్‌ లోని మొత్తం 31 జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఇప్ప‌టి వ‌ర‌కు అందుతున్న లెక్క‌ల ప్ర‌కారం కాంగ్రెస్ 18 జిల్లా ప‌రిష‌త్‌ ల‌ను కైవ‌సం చేసుకునే దిశ‌గా ముందుకు సాగుతోంది. ఈ రిజ‌ల్ట్‌ ను బ‌ట్టి చూస్తే కాంగ్రెస్ మూడింట రెండు వంతుల స్థానాలు సులువుగా గెలుచుకునేలా ఉంది.

ఇక రాష్ర్టంలోని ఆరు కార్పొరేష‌న్ ల‌లో బీజీపీ గెలిచినా కాంగ్రెస్ గ‌ట్టిపోటీ ఇచ్చింది. రాష్ర్ట ప్ర‌భుత్వంపై గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఉండ‌డంతో పాటు ప‌టేల్ రిజ‌ర్వేష‌న్ల ఆందోళ‌న‌లు బీజేపీకి బాగా దెబ్బేశాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఏదేమైనా సొంత రాష్ర్టంలో ఈ స్థాయి ఫ‌లితాలు రావ‌డం మోడీకి పెద్ద ఎదురుదెబ్బ‌గానే క‌నిపిస్తోంది.