Begin typing your search above and press return to search.

కేసీఆర్ సినిమా తర్వాత..ముందు బాబు సినిమానే

By:  Tupaki Desk   |   13 Sep 2017 6:50 AM GMT
కేసీఆర్ సినిమా తర్వాత..ముందు బాబు సినిమానే
X
గత కొన్ని నెలలుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తీయబోయే సినిమా గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ కేసీఆర్ బయోపిక్ తీయడం కోసం గట్టిగానే సన్నాహాలు చేస్తున్నాడు. బాలీవుడ్ నటులు రాజ్ కుమార్ రావు.. నవాజుద్దీన్ సిద్దిఖిల్లో ఒకరు ఈ పాత్ర పోషిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో.. ఎప్పుడు పూర్తయి ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందో కానీ.. ఈ లోపే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీవిత కథతో ఓ సినిమా తయారైపోతోంది. ఈ సినిమా చడీ చప్పుడు లేకుండా మొదలై.. ముగింపు దశకు చేరుకోవడం విశేషం.

పసుపులేటి వెంకట రమణ అనే తెలుగు దేశం అభిమాని చంద్రబాబు మీద సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘చంద్రోదయం’ అనే టైటిల్ పెట్టారు. ఆగస్టు 4న రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి ఇప్పటికే 75 శాతం పూర్తి చేసేశారట. ఇటీవలే తిరుపతిలో ‘చంద్రోదయం’ ప్రోమో కూడా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ ను కొంచెం పెద్ద స్థాయిలోనే చేశారు. వందేమాతరం శ్రీనివాస్ ఈ ప్రోమోకు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇంకొన్ని రోజుల్లోనే ‘చంద్రోదయం’ సినిమాను పూర్తి చేస్తారట. ఐతే ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసే ఉద్దేశాలేమీ లేవట. ముందుగా అమరావతిలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసి.. ఆ తర్వాత ఆన్ లైన్లో రిలీజ్ చేస్తారట. ఐతే ఈ చిత్రంలో చంద్రబాబు మొత్తం జీవితాన్ని చూపించరట. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ప్రస్థానాన్నిచూపిస్తారట. దీన్ని బట్టి చంద్రబాబు మీద ఇదో పాజిటివ్ డాక్యుమెంటరీ అని అర్థమవుతోంది. ఐతే కేసీఆర్ బయోపిక్ ఇలా కాకుండా పూర్తి స్థాయి సినిమాగా తెరకెక్కబోతోంది.