Begin typing your search above and press return to search.

భార‌తీయుల‌కు స్వీట్ న్యూస్‌.. గ్రీన్ కార్డు కోటా ఎత్తివేత‌!

By:  Tupaki Desk   |   9 Feb 2019 5:33 AM GMT
భార‌తీయుల‌కు స్వీట్ న్యూస్‌.. గ్రీన్ కార్డు కోటా ఎత్తివేత‌!
X
అమెరికా అధ్య‌క్షుడిగా ట్రంప్ ఎన్నిక అయిన నాటి నుంచి ఆ దేశానికి వ‌ల‌స వెళ్లిన వారికి.. ఇప్ప‌టికే అమెరికాలో ఉన్న వారికి చుక్క‌లు క‌నిపిస్తున్న ప‌రిస్థితి. వ‌ల‌స‌ల విష‌యంలో క‌ఠినంగా ఉండ‌టమే కాదు.. అక్ర‌మంగా ఉన్న వారిని వెన‌క్కి పంపేందుకు ట్రంప్ స‌ర్కారు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటివేళ‌.. వ‌ల‌స‌వాసుల‌కు అమెరికా పౌర‌స‌త్వాన్ని ఇచ్చే గ్రీన్ కార్డు కు కోటా అన్న‌ది లేకుండా చేసే బిల్లు ఒక‌టి చ‌ట్ట‌స‌భ‌ల్లోకి ప్ర‌వేశ పెట్ట‌టం ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా చెప్పాలి.

ఏడాదికి ప‌రిమిత సంఖ్య‌లో మాత్ర‌మే అమెరికా ప్ర‌భుత్వం గ్రీన్ కార్డుల్ని జారీ చేస్తుంటుంది. ఈ తీరుతో గ్రీన్ కార్డు కోసం పోటీ భారీగా ఉంటుంది. గ్రీన్ కార్డు పేరుతో జ‌రుగుతున్న శ్ర‌మ దోపిడీ నేప‌థ్యంలో..కోటాను ఎత్తివేయాల‌న్న డిమాండ్ ఎప్ప‌టినుంచో ఉంది. అమెరికాలో ఉండే నిపుణులకు ప్ర‌యోజ‌నం క‌లిగేలా గ్రీన్ కార్డు జారీ ఉండాల‌న్న ఉద్దేశంతో తాజాగా భార‌త మూలాలున్న అమెరిక‌న్ సెనేట‌ర్ క‌మ‌లా హ్యారీస్ తాజాగా ఒక బిల్లును సెనేట్‌లో ప్ర‌వేశ పెట్టారు.

సెనెట్‌లో ఫెయిర్ నెస్ ఫ‌ర్ హై-స్కిల్డ్ ఇమ్మిగ్రెంట్స్ యాక్ట్ పేరుతో ఉన్న ఈ బిల్లు త‌ర‌హాలోనే ప్ర‌తినిధుల స‌భ‌లోనూ 112 మంది కాంగ్రెస్ స‌భ్యుల మ‌ద్ద‌తుతో కెన్ బ‌క్ మ‌రో ప్ర‌తినిధి ప్ర‌వేశ పెట్టారు. ఈ బిల్లుకు ప్ర‌ముఖ కంపెనీలు గూగుల్‌.. వాల్ మార్ట్ లాంటి దిగ్గ‌జ సంస్థ‌లు కూడా మ‌ద్ద‌తు ఇస్తున్నాయి. అమెరికాలో శాశ్వితంగా ఉండేందుకు వీలు క‌ల్పించే గ్రీన్ కార్డు కోసం కోటా ఎత్తివేసే అవ‌కాశం ఉన్న ఈ బిల్లు చ‌ట్ట‌రూపం దాలిస్తే భార‌తీయులు పెద్ద ఎత్తున ప్ర‌యోజ‌నం పొందే వీలుంది.

ప్ర‌స్తుతం అనుస‌రిస్తున్న విధానం ప్ర‌కారం అమెరికా ప్ర‌భుత్వం ప్ర‌తి ఏటా 1.4 ల‌క్ష‌ల మందికి గ్రీన్ కార్డులు ఇస్తుంది. అదే స‌మ‌యంలో ఈబీ వీసాల కోటా కింద ఒక్కో దేశం వారు 9800 మించిన గ్రీన్ కార్డుల్ని పొంద‌లేరు. ఇప్పుడున్న అంచ‌నాల ప్ర‌కారం గ్రీన్ కార్డు కోసం ఇప్పుడు అప్లై చేస్తే.. 150 సంవ‌త్స‌రాలు ప‌ట్టే అవ‌కాశం ఉంది. దీంతో.. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకొని ప‌లు సంస్థ‌లు త‌మ ఉద్యోగుల చేత శ్ర‌మ‌దోపిడీ చేస్తున్నాయి. ఇలాంటివాటికి చెక్ పెట్టేందుకే తాజా బిల్లుగా చెబుతున్నారు. ఈ బిల్లు కానీ చ‌ట్ట‌రూపం దాలిస్తే.. భార‌తీయులు అధిక ప్ర‌యోజ‌నం పొందే వీలుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి.. ఈ బిల్లు అంతిమంగా ఏమంతుందో చూడాలి.