Begin typing your search above and press return to search.

రీల్ బిచ్చ‌గాడి మాదిరే రియ‌ల్ బిచ్చ‌గాడు!

By:  Tupaki Desk   |   12 Aug 2017 4:41 AM GMT
రీల్ బిచ్చ‌గాడి మాదిరే రియ‌ల్ బిచ్చ‌గాడు!
X
ఆ మ‌ధ్య‌న విడుద‌లైన బిచ్చ‌గాడి సినిమా గుర్తుందా? ఇప్పుడు చెప్పే ఉదంతం వింటే ఆ రీల్ క‌థే గుర్తుకు రావ‌టం ఖాయం. అంతేనా.. ఆ మ‌ధ్య‌న అప‌ర కోటీశ్వ‌రుడైన ఒక బిజినెస్ టైకూన్ కొడుకు బేక‌రీలో ప‌ని చేసిన రియ‌ల్ క‌థ విన్నాం. ఇప్పుడు అలాంటిదే మ‌రొక‌టి రిపీట్ అయ్యింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఇప్పుడీ రియ‌ల్ బిచ్చ‌గాడి స్టోరీ ఎవ‌రిదో కాదు.. అప్ప‌ట్లో బేక‌రిలో ప‌ని చేసిన ఫ్యామిలీకి చెందిన మ‌రొక‌రిది. సినిమాటిక్ గా అనిపించే ఈ ఆస‌క్తిక‌ర క‌థ‌నానికి వేదిక హైద‌రాబాద్ కావ‌టం మ‌రో విశేషం.

రీల్ క‌థ‌ను త‌ల‌పించే ఈ రియ‌ల్ క‌థ‌లోకి వెళితే.. గుజ‌రాత్ కు చెందిన హ‌రేకృష్ణ ఎక్స్ పోర్ట్స్ కు చెందిన ప్ర‌ముఖ న‌గ‌ల వ్యాపారి ఘ‌న్ శ్యాం డోలాకియా. ఆ సంస్థ ట‌ర్నోవ‌ర్ అక్ష‌రాల రూ.6వేల కోట్లు. డోలాకియా ఫ్యామిలీకి చెందిన న‌లుగురు అన్న‌ద‌మ్ముల పిల్లలున్నారు. వారిలో ఎవ‌రైనా స‌రే.. వ్యాపారంలోకి రావాలంటే అంతకు ముందు నెల పాటు త‌మ‌కు ఏ మాత్రం ప‌రిచ‌యం లేని.. సంబంధం లేని ప్రాంతంలో స్వ‌యంకృషితో అత్యంత సామాన్యుడిగా బ‌త‌కాలి. ఈ సంద‌ర్భంగా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ త‌మ‌కు సంబంధించిన వివ‌రాల్ని.. త‌న హోదా.. ప‌ర‌ప‌తి గురించి అస్స‌లు వెల్ల‌డించ‌కూడ‌దు. ఎందుకిలా అంటే.. లోకం పోక‌డ ఏమిటో తెలుసుకోవ‌టంతో పాటు త‌మ‌ను న‌మ్ముకొని బ‌తికే వారికి మ‌నం ఏం చేస్తే సంతోషిస్తారో తెలుసుకోవ‌టం ప్ర‌ధాన ఉద్దేశం.

హైద‌రాబాద్ లో నెల రోజులు అత్యంత సామాన్యంగా బ‌తికేసిన ఈ రియ‌ల్ బిచ్చ‌గాడి పేరు హితార్థ్‌.  పాతికేళ్ల కుర్రాడు. అమెరికాలోని న్యూయార్క్ లో చ‌దువుకున్నాడు. పైలెట్ కోర్సు కూడా చేశాడు. కుటుంబ వ్యాపారంలోకి రావాల‌నుకున్నాడు. ఆ విష‌యం చెప్పిన వెంట‌నే.. కుటుంబానికి సంప్ర‌దాయంగా ఉన్న నెల రోజుల  అజ్ఞాతవాసానికి రెఢీ అయిపోయాడు.

తండ్రి ఇచ్చిన రూ.500 జేబులో పెట్టుకొని.. మ‌రో చేత్తో సీల్డ్ క‌వ‌ర్ పెట్టుకున్నాడు. అందులో తాను ఎక్క‌డికి వెళ్లాలో అందుకు సంబంధించిన ఫ్లైట్ టికెట్ ఉంటుంది. ఎయిర్ పోర్ట్‌కు వెళ్లిన త‌ర్వాత మాత్ర‌మే ఆ క‌వ‌ర్ ను విప్ప‌దీసి చూడాల్సి ఉంటుంది. అలా ఎయిర్ పోర్ట్ కు వెళ్్లిన హితార్థ్‌కు.. అందులో హైద‌రాబాద్ ఉంది. అప్ప‌టివ‌ర‌కూ హైద‌రాబాద్ గురించి విన్నాడే కానీ.. తెలిసిందేమీ లేదు.

ఫ్లైట్లో హైద‌రాబాద్ కు వ‌చ్చిన అత‌డు బ‌స్సులో నేరుగా సికింద్రాబాద్‌కు చేరుకున్నాడు. అక్క‌డే ఓ లాడ్జిలో రూ.100ల‌కు రూమ్ తీసుకొని ఒక రోజు గ‌డిపాడు. ఒక రైతు కొడుకుగా చెప్పుకొని.. ఉద్యోగం కోసం వెతుకుతున్న‌ట్లుగా చెప్పాడు.  ఉద్యోగ వేట‌లో చాలామందిని క‌లిశాడు. ఒక్కొక్క‌రూ ఒక్కో స‌ల‌హా ఇచ్చారు. ఉద్యోగం దొరికే ప్రాంతాల గురించి సూచించారు. ఓ బ‌స్సులో కండక్ట‌ర్ చెప్పిన‌ట్లుగా అమీర్ పేట‌లో దిగి లాల్ బంగ్లా స‌మీపంలో ఉన్న ఓ టెలీకాల‌ర్ కార్యాల‌యానికి వెళ్లాడు.

అక్క‌డ ఉద్యోగం గురించి అడిగితే ఒక మ‌హిళ హైటెక్ సిటీలో ఒక ఉద్యోగం గురించి చెప్ప‌టంతో ఓకే అన్నాడు. రూ.500 చేతిలో పెట్టి.. ముందు భోజ‌నం పెట్టిన త‌ర్వాత అక్క‌డ‌కు వెళ్ల‌మ‌న్నార‌ట‌. కానీ.. ఆ జాబ్ లో కుదురుకోలేదు. త‌ర్వాత అక్క‌డ మానేసి.. మెక్ డోనాల్డ్స్ లో ప‌ని చేశాడు. ఒక్కో రోజు ఒక్కో సెంట‌ర్లో ప‌ని చేయాల్సి రావ‌టంతో ఆ ఉద్యోగాన్ని వ‌దులుకున్నాడు. త‌ర్వాత‌.. నైకీ కంపెనీ.. అడిడాస్ లో వారం మాత్ర‌మే ప‌ని చేశాడు. అయినా కుదురుకోలేక‌పోయాడు.
మ‌ళ్లీ సికింద్రాబాద్ వ‌చ్చేసిన అత‌గాడు బ‌న్సీలాల్ పేట‌లోని ఒక వైట్ బోర్డు త‌యారీ కంపెనీలో చేరాడు. ఇక్క‌డ ప‌ని చేయ‌టం మొద‌లెట్టిన త‌ర్వాత మురికివాడ‌లో ఉండాల్సి వ‌చ్చింది. ఒక‌సారి ఒక రిక్షా కార్మికుడితో.. ఒక‌సారి మ‌రో సాధువుతో క‌లిసి ఒకే గ‌దిలో ఉండాల్సి వ‌చ్చింది.  రోజువారీ తిండి కోసం రోడ్డు ప‌క్క‌న  పెట్టే బండ్ల మీద టిఫిన్లు.. భోజ‌నం చేసేవాడు. అలా నెల పాటు సాగిన అత‌డి ప‌రీక్ష విజ‌య‌వంతంగా ముగిసింది.

నెల రోజులు పూర్తి అయిన వేళ‌.. త‌న వివ‌రాల్ని వెల్ల‌డించి.. తాను ఎక్క‌డ ఉన్నాడో చెప్పాడు హితార్థ్‌. అంతే.. ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆఘ‌మేఘాల మీద విమానం క‌ట్టుకొని వ‌చ్చి హైద‌రాబాద్ లో వాలిపోయారు. ఈ విష‌యం గురించి తెలిసిన వెంట‌నే సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. తాను ప‌రీక్ష‌ను విజ‌య‌వంతంగా ముగించ‌లేక‌పోయాన‌ని చెప్పుకొచ్చాడు హితార్థ్‌. తాను సామాన్య యువ‌కుడిలా క‌నిపించ‌లేక‌పోయాన‌ని చెప్పుకొచ్చాడు.

సామాన్యుడిలా క‌నిపించ‌లేకున్నా.. చాలామంది ప్రేమ‌ను.. అభిమానాన్ని పొందాన‌ని చెప్పాడు. తాను ఎవ‌రో తెలీకున్నా భాగ్య‌న‌గ‌రి త‌న‌ను అక్కున చేర్చుకుంద‌ని.. త‌న‌కు ఉద్యోగం కావాల‌న్న వెంట‌నే పొంద‌గ‌లిగాన‌న్నాడు. క‌ష్టాల్లో ఉన్నాన‌ని చెప్పిన త‌న రెడీమెడీ క‌థ‌ను విని చాలామంది స్పందించార‌న్నాడు. త‌న‌కు వ‌రి అన్నం తినే అల‌వాటు లేద‌ని.. కానీ తిన‌టం నేర్చుకున్నాన‌న్నారు. నెల రోజులు జీవితం త‌న‌కెన్నో పాఠాలు నేర్పింద‌న్నాడు. రీల్ క‌థ‌ను త‌ల‌పించే ఈ రియ‌ల్ క‌థ ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.