Begin typing your search above and press return to search.

ఇత‌డు రీల్ మ‌హ‌ర్షికి మించిన రియ‌ల్ మ‌హ‌ర్షి!

By:  Tupaki Desk   |   21 May 2019 1:30 AM GMT
ఇత‌డు రీల్ మ‌హ‌ర్షికి మించిన రియ‌ల్ మ‌హ‌ర్షి!
X
రైతుల కోసం త‌న సంప‌ద‌లో 90 శాతం ఆస్తిని అన్న‌దాత‌ల కోసం ఇచ్చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన రీల్ మ‌హ‌ర్షిను వెండితెర మీద చూసేశాం. తాజాగా.. ఒక రియ‌ల్ మ‌హ‌ర్షి తీసుకున్న నిర్ణ‌యంపై వంద‌లాది మంది త‌ల్లిదండ్రులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. స‌ద‌రు రియ‌ల్ మ‌హ‌ర్షికి చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నారు.

ఇంత‌కీ ఈ రియ‌ల్ మ‌హ‌ర్షి ఎవ‌రు? ఏం చేశారు? వంద‌లాది మంది మ‌న‌సుల్ని దోచేసుకునేలా ఆయ‌నేం నిర్ణ‌యాన్ని వెల్ల‌డించార‌న్న విష‌యాల్లోకి వెళితే.. ఉన్న‌త విద్య కోసం భారీ ఎత్తున బ్యాంకు రుణాలు చేసి చ‌దువుకునే విద్యార్థులు ఎంతో మంది క‌నిపిస్తారు. ఇలానే అప్పులు చేసి చ‌ద‌విన విద్యార్థుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయే ప‌రిస్థితి.

ఇలాంటివేళ‌లో.. అలాంటి విద్యార్థుల మీద ఉన్న అప్పుల‌న్ని తీర్చేస్తూ అమెరికాకు చెందిన ఒక వ్యాపార దిగ్గ‌జం సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

ప్ర‌తిష్ఠాత్మ‌క అమెరికన్ కాలేజీ అయిన అట్లాంటా బ్లాక్ మోర్ హోస్ కాలేజీలో ఉన్న విద్యార్థుల మీద ఉన్న రూ.250 కోట్ల రుణాల్ని తాను చెల్లిస్తాన‌ని ప్ర‌క‌ట‌న చేశారు. 440 కోట్ల డాల‌ర్ల ఆస్తి ఉన్న ఆఫ్రిక‌న్- అమెరిక‌న్ వాణిజ్య వేత్త రాబ‌ర్ట్ ఎఫ్ స్మిత్.. కాలేజీలో జ‌రిగిన కొత్త డిగ్రీప‌ట్టా ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మానికి హాజ‌రై ఈ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

త‌న లాంటి ఎంద‌రో బ్లాక్ అమెరిక‌న్ల ఉన్న‌తికి త‌న‌వంతు సాయంగా భ‌రోసా ఇవ్వాల‌న్న ఉద్దేశంతోనే తానీ ప్ర‌క‌ట‌న చేసిన‌ట్లుగా ఆయ‌న చెబుతున్నారు. కాలేజీకి చెందిన విద్యార్థుల రుణాల్ని మాఫీ చేసేలా త‌మ కుటుంబం నిధులు మంజూరు చేస్తుంద‌ని గ్రాడ్యుయేష‌న్ మీట్ లో పాల్గొన్న స్మిత్ పేర్కొన్నారు. రీల్ మ‌హ‌ర్షికి మించిన‌ట్లుగా ఉన్న ఈ రియ‌ల్ మ‌హ‌ర్షికి హ్యాట్సాప్ చెబుదామా?