హెచ్4వీసా..ట్రంప్ కు షాకిచ్చేలా అమెరికాలో బిల్లు

Sat Nov 17 2018 20:27:55 GMT+0530 (IST)

గత కొన్ని నెలల నుంచి వేలమంది భారతీయులను కలవర పెడుతున్న  హెచ్4 వర్క్ పర్మిట్ల వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమాత్రం కనికరం చూపడం లేదనే సంగతి తెలిసిందే. అమెరికాలో చట్ట బద్ధంగా పనిచేయడానికి వీలుగా హెచ్1 బీ వీసా ఉన్నవారి జీవిత భాగస్వాములకు హెచ్4 వీసాను జారీ చేస్తున్నారు. 2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా చట్టం తెచ్చారు. ఇలా వీసా పొందిన వారిలో చాలా మంది భారత్ కు చెందిన నిపుణులే.  ప్రస్తుతం అమెరికాలో 70 వేల మంది భారతీయులకి హెచ్4 వీసా ఉన్నట్లు అంచనా. ఇలాంటి కీలకమైన అంశంలో మొండిగా వ్యవహరిస్తున్నట్రంప్ కు షాక్ తగిలే పరిణామం జరిగింది. అమెరికాలో ఉంటున్న ఎంతోమంది భారతీయులకు ఊరటనిచ్చే బిల్లు అమెరికా చట్టసభలో ప్రవేశపెట్టారు.హెచ్ 1 బి వీసాలు కలిగినవారి జీవిత భాగస్వాములకు వర్క్ ఆథరైజేషన్ లభిస్తుంది. విదేశాలకు చెందిన ప్రొఫెషనల్స్ - ఇంజినీరింగ్ నిపుణులు అమెరికాలో పని చేసేందుకు హెచ్ 1 బి వీసాను జారీ చేస్తారు. దాంతోపాటు వారి భార్యలకు గానీ లేదా ఇతర సమీప బంధువులకు గానీ హెచ్ 4 వీసాలు ఇష్యూ చేస్తారు. ఒబామా హయాంలో అమలైన ఈ హెచ్ 4 ఎంప్లాయిమెంట్ ప్రొటెక్షన్ యాక్టును.. ట్రంపు సర్కారు ఎత్తేయాలని యోచిస్తోంది. హెచ్1బి వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములకు వర్క్ ఆథరైజేషన్ రద్దు చేయాలన్న ట్రంప్ సర్కారు నిబంధనలకు వ్యతిరేకంగా అమెరికన్ కాంగ్రెస్ లో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చాక ఈ ఏడాది చివరి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే జీవిత భాగస్వాములకు జారీ చేసే హెచ్ 4 వీసా మీద వర్క్ ఆథరైజేషన్ ఇవ్వాలంటూ చట్టసభలో బిల్లును ప్రవేశపెట్టారు. తాజాగా వచ్చే చట్టం అమలైతే అమెరికాలో ఉంటున్న హెచ్ 1 బి వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు ఇక దేశం విడిచి వెళ్లాలన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

హెచ్4 వీసాలవిషయంలో ట్రంప్ ప్రతిపాదించిన ఈ కొత్త నిబంధనలకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) తుది రూపు ఇస్తోంది. 2015లో ఒబామా తెచ్చిన ఈ చట్టాన్ని రద్దు చేయాలని తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కోర్టుకు తెలిపింది. తుది నోటిఫికేషన్ జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా తెరమీదకు వచ్చిన బిల్లు ఆమోదం పొందితే పెద్ద ఎత్తున ఉన్న భారతీయులకు ఉపశమనం దక్కుతుంది.