Begin typing your search above and press return to search.

బెంగ‌ళూరులో వికృత చేష్ట‌ల‌కు అడ్డుక‌ట్ట ప‌డ‌దా?

By:  Tupaki Desk   |   23 March 2017 6:46 AM GMT
బెంగ‌ళూరులో వికృత చేష్ట‌ల‌కు అడ్డుక‌ట్ట ప‌డ‌దా?
X
నిజ‌మేనండోయ్‌... కూల్ సిటీగానే కాకుండా ఇండియ‌న్ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగ‌ళూరు సేఫెస్ట్ న‌గ‌రం జాబితాల నుంచి త‌ప్పుకున్న‌ట్టే ఉంది. ఎందుకంటే... ఆ న‌గ‌రంలో వ‌రుస‌గా చోటుచేసుకుంటున్న ఘ‌ట‌న‌లు చూస్తుంటే... ఇక‌పై ఈ న‌గ‌రాన్ని సుర‌క్షిత న‌గ‌రంగా చెప్పుకునేందుకు మ‌నం కూడా అంత‌గా ఇష్ట‌ప‌డం. మొన్న‌టికి మొన్న న్యూ ఇయ‌ర్ నాడు వెలుగు చూసిన వేధింపుల ప‌ర్వం యావత్తు దేశాన్నే వ‌ణికించింది. ఆ త‌ర్వాత ఆ ఘ‌ట‌న అంతా ఓ జంట పాల్ప‌డిన దుర్మార్గంగా తేలినా... ఆ త‌ర్వాత ఒంట‌రిగా వెళుతున్న ఓ యువ‌తి ప‌ట్ల ఇద్ద‌రు మృగాళ్లు పాల్ప‌డిన వేధింపుల వీడియో పెను క‌ల‌వ‌రాన్నే రేపింది. త‌న ఇంటికి స‌మీపంలోకి వ‌చ్చిన యువ‌తిని బైక్‌పై వ‌చ్చిన ఇద్ద‌రు వ్య‌క్తులు అడ్డ‌గించ‌డ‌మే కాకుండా... ఆమెపై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ‌టంతో పాటు ఎదురు తిరిగిన పాపానికి ఆమె ముఖంపై పిడిగుద్దులు కురిపించిన వైనం దేశ‌మంతా చూసిందే.

నాడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ఈ వీడియో మ‌న మ‌దిలో నుంచి చెరిగిపోక‌ముందే... అలాంటి ఘ‌ట‌నే మ‌రొక‌టి చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో మృగాళ్ల బారిన ప‌డింది ఒక్క‌రు కాదు... ఇద్ద‌రు మ‌హిళ‌లు. వీరి వెంట ప‌డింది ఇద్ద‌రు మృగాళ్లు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది. న‌గ‌రంలోని విజ‌యాన‌గ‌ర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకెళితే... రోడ్డు మీద వెళుతున్న ఇద్దరు మహిళల‌ను.. టూవీలర్ మీద వ‌చ్చిన‌ ఇద్దరు యువకులు వారిని వేధించిన దృశ్యాలు నమోదయ్యాయి. వాహనం వెనుకున్న యువకుడు సదరు యువతుల పట్ల అసభ్యంగా వ్యవహరించటమే కాదు.. వారిని లైంగికంగా వేధించినట్లుగా దృశ్యాలు ఉన్నాయి.

అయితే.. వారిని లైంగికంగా వేధించారా? లేక.. దోపిడీ యత్నించారా? అన్నది తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే... ఈ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టిదాకా పోలీసుల‌కు ఎలాంటి ఫిర్యాదు అంద‌లేదట‌. వేధింపుల‌కు గురైన బాధిత మహిళలు ఎవరు? వేధించిన కుర్రాళ్లు ఎవరు? అన్న వివరాలు కూడా బయటకు రాలేదు. ఈ నేప‌థ్యంలో సోషల్ మీడియాలో ఈ వీడియోను ఎవరు పోస్ట్ చేశారన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు. బెంగళూరు మహా నగర ఇమేజ్ ను డ్యామేజ్‌ చేస్తున్న ఈ వీడియోపై పోలీసులు కాస్తంత సీరియస్ గా రియాక్ట్ అవుతున్న‌ట్లుగా స‌మాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/