Begin typing your search above and press return to search.

బీహార్‌లోని గాంధీగిరిని చూసి ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే

By:  Tupaki Desk   |   23 Feb 2017 4:46 PM GMT
బీహార్‌లోని గాంధీగిరిని చూసి ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే
X
స‌మ‌స్య‌ల‌ను స‌రైన రూపంలో వ్య‌క్తీక‌రించేందుకు గాంధీగిరిని ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు త‌మ నిర‌స‌న‌లో భాగం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయ నాయ‌కులు, అదికూడా ముఖ్య‌మ‌త్రి స్థాయిలో ఉన్న‌వారు మాట నిల‌బెట్టుకోకుంటే ఎలాంటి ప‌రిస్థితులు ఉంటాయో తెలియ‌జెప్పేందుకు ఈ గాంధీగిరి నిర‌స‌న ఓ ఉదాహ‌రణ‌. బ్రిటిష్ వ‌ల‌స పాల‌కుల‌కు వ్య‌తిరేకంగా అహింసాయుత పోరాటానికి నాందీ ప‌లికిన చంపార‌న్ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే త‌న నియోజ‌క‌వ‌ర్గ‌ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునేందుకు అదే మార్గాన్ని ఎన్నుకున్నారు. బీహార్‌ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ త‌న‌కు ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోక‌పోవ‌డంతో కేవ‌లం బ‌నియ‌న్‌ - నిక్క‌ర్‌ తో భూమిపై పాక్కుంటూ పాట్నాలోని అసెంబ్లీకి వ‌చ్చి త‌న నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్డు సౌక‌ర్యం లేని ధీన స్థితిని యావ‌త్తు దేశానికి తెలిసేలా చేశారు. ఆ ఎమ్మెల్యే బీజేపీకి చెందిన చంపార‌న్ శాస‌న‌స‌భ్యుడు విన‌య్ బిహారీ.

బీహార్‌లోని ద‌క్షిణ చంపార‌న్ జిల్లా లారియా నియోజ‌క‌వ‌ర్గానికి విన‌య్ ఎమ్మెల్యే. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్లు స‌రిగా లేక‌పోవ‌డంతో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ విష‌యాన్ని ఇటు మంత్రుల‌కు, అధికారుల‌కు వెళ్ల‌డించిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేదు. ఓ శుభ‌ముహూర్తాన సీఎం నితీశ్ కుమార్ దృష్టికి త‌న ఆవేద‌న‌ను చెప్పుకున్నాడు. వెంట‌నే స్పందించిన నితీశ్ త్వ‌ర‌లో రోడ్డు వేయిస్తాన‌ని హామీ ఇచ్చారు. అయితే కార‌ణాలు ఏవైనా రోడ్లు మాత్రం బాగుప‌డ‌లేదు. దీంతో విసిగివేసారిన వినయ్...తాను రోడ్లు వేయించ‌లేక‌పోతే బ‌నియ‌న్‌, నిక్క‌రుతో అసెంబ్లీకి వెళ్తానని చేసిన ప్ర‌క‌ట‌న గుర్తు పెట్టుకొని దాన్ని అమ‌ల్లో పెట్టేశాడు.

అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో త‌న నియోజ‌క‌వ‌ర్గ‌మైన‌ లారియా నుంచి రాజ‌ధాని పాట్నాకు బ‌నియ‌న్‌, నిక్క‌రు మాత్ర‌మే ధ‌రించి వ‌చ్చిన విన‌య్ అసెంబ్లీ స‌మీపంలో ఉండ‌గానే వాహ‌నం దిగి భూమిపై పాక్కుంటూ అక్క‌డికి చేరుకున్నారు. ఎమ్మెల్యే ఇలా భూమిపై పాక్కుంటూ వ‌స్తుండ‌టంతో అంతా అవాక్క‌య్యారు. ఈ క్ర‌మంలోనే మీడియా స‌హ‌కారంతో ఆయ‌న అసెంబ్లీ ప్రాంగ‌ణంలోకి చేరుకున్నారు. అయితే భ‌ద్ర‌తా సిబ్బంది అడ్డుకోవ‌డంతో విన‌య్ ఆ వేష‌ధార‌ణ‌లో అసెంబ్లీలోకి అడుగుపెట్ట‌లేక‌పోయారు! కాగా, మ‌హాత్మాగాంధీ చేప‌ట్టిన స‌త్యాగ్ర‌హ దీక్ష‌కు వందేళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా ఈ సాహ‌సాన్ని చేప‌ట్టారా లేక సంద‌ర్భం కుదిరింద‌ని ముందుకు వెళ్లారా తెలియ‌దు కానీ ఈ గాంధీగిరి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇంత‌కీ ఈ ప‌రిణామంపై సీఎం నితీశ్ కుమార్ ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/