విధేయుడే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి

Mon Jun 19 2017 15:02:10 GMT+0530 (IST)

పెద్ద సస్పెన్స్ వీడిపోయింది. గడిచిన కొద్ది నెలలుగా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న అంశంపై సాగుతున్న చర్చలకు పుల్ స్టాప్ పెట్టేస్తూ.. తాజాగా తమ నిర్ణయాన్ని వెల్లడించారు. రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించటంలో తనదైన శైలిలో నిర్ణయం తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రస్తుతం బిహార్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న రామ్ నాథ్ ను ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

విధేయతకు పెద్దపీట వేస్తూ.. తమ కనుసన్నల్లో నడిచే వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించటం రాజకీయ వర్గాల్లో పెను చర్చకు తెర తీశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తాజాగా ఎంపిక చేసిన అభ్యర్థి దళిత వర్గానికి చెందిన వ్యక్తికావటంతో.. రాష్ట్రపతి అభ్యర్థిత్వం ద్వారా పెను రాజకీయ ప్రయోజనానికి మోడీ అండ్ కో వ్యూహరచన చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బీజేపీలో దళిత నేతగా ఎదిగి.. ఉత్తరప్రదేశ్ నుంచి రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించి.. ప్రస్తుతం బీహార్ లాంటి కీలక రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరిస్తున్న రామ్ నాథ్ కోవింద్ తమ రాష్ట్రపతి అభ్యర్థి అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. మరో కీలకమైన విషయం ఏమిటంటే.. రామ్ నాథ్ గతంలో సుప్రీంకోర్టు.. హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. సుదీర్ఘ చర్చల అనంతరం రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసినట్లు షా వెల్లడించారు.

భాజాపాలో అత్యంత ఉన్నతస్థాయికి ఎదిగిన దళిత నేత రామ్ నాథ్ అంటూ కొనియాడారు. తమ అభ్యర్థి ఎవరన్న విషయాన్ని విపక్షాలకు ఫోన్ ద్వారా తెలియజేసినట్లుగా షా చెప్పారు. బీజేపీ నేతలతో జరిపిన చర్చల్లో ఉప రాష్ట్రపతి అభ్యర్థిత్వం గురించి చర్చ జరగలేదన్నారు.

ఇక.. రామ్ నాథ్ గురించి వివరాలు చూస్తే.. 1945లో ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దెహత్ జిల్లాలోని డేరాపూర్ తహశీల్ లోని పరాంఖ్ గ్రామంలో ఆయన జన్మించారు. 1998 నుంచి 2002 వరకూ బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా పని చేశారు. అఖిల భారత్ కోలి సమాజ్ అధ్యక్షునిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పని చేశారు. 2015 ఆగస్టు 16 నుంచి బిహార్ గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/