Begin typing your search above and press return to search.

బీహార్ కాంగ్రెస్ లో ఒకేసారి 45 మందిపై వేటు

By:  Tupaki Desk   |   1 Dec 2015 9:47 AM GMT
బీహార్ కాంగ్రెస్ లో ఒకేసారి 45 మందిపై వేటు
X
బీహార్ కాంగ్రెస్ పవర్ ఫుల్ డెసిషన్ తీసుకుంది. మొన్నటి ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లిచ్చిన అభ్యర్థులపై రెబల్స్ గా బరిలో దిగిన కాంగ్రెస్ నేతలపై వేటు వేసింది. అయితే... ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 45 మంది తిరుగుబాటు నేతలను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండు చేస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.

బీహార్ లో మొన్న రసవత్తరంగా సాగిన ఎన్నికల్లో వివిధ కారణాలతో జరిగిన ఓట్ల చీలికలే అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేశాయి. అన్ని పార్టీలు కూడా కీలకంగా, ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెబల్ కేండిడేట్ల వల్ల తీవ్ర ఇబ్బందులు పడింది.పార్టీ పెద్దలు ఎంతగా బుజ్జగించినా వినకుండా పలుచోట్ల రెబెల్స్ ఓట్లను చీల్చి కాంగ్రెస్ అధికారిక అభ్యర్థుల గెలుపును అడ్డుకున్నారు. దీంతో మండిపడిన పార్టీ నాయకత్వం వారందరిపై వేటేసింది.

పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీలో దిగిన 45 మంది కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేస్తూ బీహార్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయం తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే జగన్నాథ్ ప్రసాద్ రాయ్ నేతృత్వంలో సమావేశమైన పార్టీ డిసిప్లినరీ కమిటీ ఈ మేరకు నిర్ణయించింది. సస్పెండైన వారిలో కాంగ్రెస్ పార్టీ బీహార్ శాఖ మాజీ అధ్యక్షుడు రామ్ జతన్ సిన్హా - సీనియర్ నాయకులు రఘునందన్ మాంఝీ - లల్లన్ కుమార్ - రామచరిత యాదవ్ - సునీతా దేవిలు కూడా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు వీరందరినీ ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్ల డిసిప్లినరీ కమిటీ ప్రకటించింది. రానున్న కాలంలో మిగతా రాష్ట్రాల ఎన్నికల్లో జరగనున్న ఎన్నికల్లో ఇలాంటి రెబల్స్ ప్రమాదం తగ్గించేందుకు గాను గట్టి చర్యలు తీసుకుని దేశమంతటా ఉన్న కాంగ్రెస్ నేతలకు సంకేతాలు పంపించినట్లుగా భావిస్తున్నారు.