Begin typing your search above and press return to search.

నితీశ్ దెబ్బ‌కు...కాంగ్రెస్ జీరో అవుతోందే!

By:  Tupaki Desk   |   2 Sep 2017 6:35 AM GMT
నితీశ్ దెబ్బ‌కు...కాంగ్రెస్ జీరో అవుతోందే!
X
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారిపోతోంది. ఉమ్మ‌డి ఏపీని రెండు రాష్ట్రాలుగా విడ‌గొడుతూ ఆ పార్టీ నేతృత్వంలోని ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌తో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బ తిన్న‌ది. తెలంగాణ‌లో కాస్తో - కూస్తో సీట్లు వ‌చ్చినా... ఏపీలో ఆ పార్టీ గ్రాఫ్ జీరోకి చేరిపోయింది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసినా కూడా సింగిల్ సీటు కూడా గెల‌వ‌లేక‌పోయింది. మొన్న‌టి నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో నోటా ఓట్ల‌కు పోటీ ప‌డి మ‌రీ అత్య‌ల్ప ఓట్ల‌ను సాధించి... న‌వ్యాంధ్ర‌లో ఇక త‌న‌కు కోలుకునే అవ‌కాశం లేద‌ని తేల్చేసుకుంది. స‌రేలే... దేశంలో 29 రాష్ట్రాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప‌రిస్థితి బాగాలేక‌పోతే... మిగిలిన 27 రాష్ట్రాలున్నాయి క‌దా అంటారా? ఈ 27 రాష్ట్రాల్లోనూ ప‌రిస్థితి ఏమీ బాగాలేద‌ని... ఇటీవ‌ల వ‌రుస‌గా చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు చెప్ప‌క‌నే చెబుతున్నాయి.

ఇటీవ‌లే బీహార్ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసే స‌త్తా లేని కాంగ్రెస్ పార్టీ నితీశ్ కుమార్ ఆధ్వ‌ర్యంలోని జేడీయూ - లాలూప్ర‌సాద్ యాద‌వ్ ఆధ్వ‌ర్యంలోని ఆర్జేడీల‌తో క‌లిసి పోటీ చేసింది. ఆ ఎన్నిక‌ల్లో ఈ కూట‌మికి అధికారం ద‌క్క‌గా, కాంగ్రెస్ పార్టీకి 27 అసెంబ్లీ సీట్లు ద‌క్కాయి. ఇక ఆ రాష్ట్ర ఎగువ స‌భ శాస‌న‌మండలిలో ఆ పార్టీకి ఆరుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. మ‌రి సంఖ్య బాగానే ఉంది క‌దా... ఇప్పుడొచ్చిన ఇబ్బందేమిటంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పుణ్య‌మా అని బీహార్ ఎన్నిక‌ల్లో త‌న‌ను ఓడించేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డిన బీజేపీతో నితీశ్ కుమార్ చేతులు క‌లిపేశారు. ఆ వెంట‌నే జేడీయూ మిత్ర‌ప‌క్షం ఆర్జేడీ, ఆ పార్టీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ తో పాట ఆయ‌న కుటుంబ స‌భ్యులు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.

ఇప్పుడు జేడీయూ, ఆర్జేడీ పొత్తు ముగిసిన అద్యాయ‌మ‌నే చెప్పాలి. ఇక జేడీయూతో జ‌ట్టు క‌ట్టిన కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే.. బీజేపీతో జ‌త‌క‌ట్టే పార్టీల‌తో కాంగ్రెస్‌కు దోస్తీ దాదాపుగా కుద‌ర‌దు. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా త‌న దారి తాను చూసుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి అక్క‌డ నెల‌కొంద‌న్న మాట‌. అంటే... జేడీయూ దెబ్బ‌కు ఆర్జేడీ, కాంగ్రెస్ కూడా సింగిల్ ప‌క్షాలుగానే మిగిలిపోయాయన్న‌మాట‌. అయినా 27 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు ఉన్న కాంగ్రెస్ పార్టీ గ‌ట్టిగానే ఉంది క‌దా అంటే... అది కూడా ఏమీ లేద‌ట‌. నితీశ్ కుమార్ కొట్టిన దెబ్బ‌కు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆ బ‌లం కూడా క‌రిగిపోతోంద‌ట‌. ఇప్ప‌టికిప్పుడు ఒకేసారి 14 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జేడీయూలో చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నార‌ట‌.

ఈ విష‌యం తెలిసిన వెంట‌నే షాక్ తిన్న పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ సీనియ‌ర్త‌తో అత్య‌వ‌స‌రంగా భేటీ కావాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఈ భేటీకి ఏఐసీసీ ప్ర‌ముఖుల‌తో పాటు బీహార్ పార్టీ ప్ర‌ముఖులు కూడా హాజ‌రుకానున్న‌ట్లు స‌మాచారం. పార్టీ మారుతున్నార‌నుకుంటున్న వారితో ఇప్ప‌టికే అధిష్ఠానం పెద్ద‌లు చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ బుజ్జ‌గింపుల‌కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని కూడా స‌మాచారం. ఈ క్ర‌మంలో ఒకేసారి 14 మంది ఎమ్మెల్యేలు జేడీయూలో చేరిపోతే.. మిగిలిన వారు కూడా రేపో మాపో అదే దారి ప‌ట్టే ప్ర‌మాదం లేక‌పోలేదు. ఇదే జరిగితే... బీహార్‌లో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి జీరోకు ప‌డిపోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.