Begin typing your search above and press return to search.

నిండా మునిగిన బాధితులు.. 2వేల కోట్ల స్కాం

By:  Tupaki Desk   |   12 Jun 2019 10:03 AM GMT
నిండా మునిగిన బాధితులు.. 2వేల కోట్ల స్కాం
X
మరో భారీ స్కాం బయటపడింది.. ఏకంగా 2 వేల కోట్ల సొమ్మును హాంఫట్ చేసేశారు.. రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించిన జనానికి సున్నం పెట్టారు. ఆ సొమ్మునంతా ఓ గ్రూపు అప్పనంగా లంచాలుగా పంచేసి.. అడ్రస్ తిప్పేసింది. ఇప్పుడు గ్రూపు చైర్మన్ ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆడియో క్లిప్ వదిలాడు.. దీంతో బాధితులంతా బెంగళూరులోని శివాజీనగర్ లో ఆందోళన చేపట్టారు.

*ఏంటీ వివాదం..
బెంగళూరుకు చెందిన ‘ఐ మానెటరీ అడ్వైజరీ ’ (ఐఎంఏ) అనే ఇస్లామిక్ బ్యాంక్ ను నగల సంస్థ యజమాని అయిన మహ్మద్ మన్సూర్ ఖాన్ ఏర్పాటు చేశాడు. ముస్లింలలో మంచి పేరు, పరపతి ఉండడంతో ఈయనను ముస్లింలు, ఇతర కులస్థులు నమ్మారు. అధిక వడ్డీ ఆశచూపి ప్రజల నుంచి దాదాపు 2000 కోట్లు సేకరించాడు. అయితే ఒక్కసారిగా బిచాణా ఎత్తివేసి పారిపోయాడు..

*ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపు
2000 కోట్ల డిపాజిట్లు సేకరించిన మన్సూర్ ఖాన్ తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు ఆడియో క్లిప్ ద్వారా పేర్కొనడం కలకలం రేపింది. ఆ ఆడియో వైరల్ కావడంతో డిపాజిట్లు చేసిన వారంతా బెంగళూరులోని శివాజీనగర్ లో ఉన్న మన్సూర్ ఖాన్ కార్యాలయం ఐఎంఏ కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళన చేశారు.

*కాంగ్రెస్ ఎమ్మెల్యేకు 400 కోట్లు లంచం
12 ఏళ్లు శ్రమించి ఈ సంస్థను నిర్మించానని.. కేంద్ర రాష్ట్రాల్లో అవినీతిని నెలకొందని.. అధికారులు, రాజకీయ నాయకులకు లంచాలు ఇవ్వాల్సి వచ్చిందని.. అలా 400 కోట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన రోషన్ బేగ్ కు అప్పుగా ఇచ్చి మోసపోయానని మన్సూర్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు.. వాళ్లు డబ్బులు తిరిగి చెల్లించలేదని.. నా ఆఫీసుకు, ఇంటికీ రౌడీలను పంపి బెదిరించారని.. చంపేస్తామంటున్నారని.. అందుకే ఇలా అప్పుల పాలై కుటుంబంతో కలిసి పారిపోయానని మన్సూర్ ఖాన్ తెలిపారు.

*బతికుంటానో లేదో.. 500 కోట్ల ఆస్తులు పంచండి
తనను మోసం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాలని.. తనను ఎలాగైనా చంపేస్తారని మన్సూర్ ఖాన్ వాపోయారు. 500 కోట్ల విలువైన తన ఆస్తిని విక్రయించి డిపాజిట్ చేసిన బాధితులకు చెల్లించాలని మన్సూర్ ఆలీఖాన్ ఆడియో క్లిప్ లో కోరారు.

*9700మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు
ఆడియో క్లిప్ లో చనిపోతున్నానని మన్సూర్ ఖాన్ చెప్పడంతో డిపాజిట్ చేసిన 9700మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాండ్యా, తుమకురు, ఇతర జిల్లాల నుంచి బెంగళూరుకు వచ్చి ఆందోళన చేశారు. దీంతో మన్సూర్ పై కేసునమోదు చేసిన పోలీసులు పారిపోకుండా లుక్ ఔవుట్ నోటీసులు జారీ చేశారు. ఆయన కోసం వెతుకుతున్నారు. అంతేకాదు సదురు కాంగ్రెస్ ఎమ్మెల్యేను విచారించేందుకు రెడీ అయ్యారు.

ఇక ఇదే మన్సూర్ ఖాన్ కర్ణాటక సీఎం కుమారస్వామితో భోజనం చేస్తున్న ఫొటోను బయటపెట్టి బీజేపీ కలకలం రేపింది. ఈ కుంభకోణం వెనుక కాంగ్రెస్, జేడీఎస్ పెద్దలు ఉన్నారని ఆరోపించింది.