Begin typing your search above and press return to search.

400 ట‌న్నుల మ‌హావిష్ణువు ప్ర‌త్యేక‌త‌లు ఇవి

By:  Tupaki Desk   |   22 Jun 2017 6:18 PM GMT
400 ట‌న్నుల మ‌హావిష్ణువు ప్ర‌త్యేక‌త‌లు ఇవి
X
పొరుగున ఉన్న త‌మిళ‌నాడు - క‌ర్ణాట‌క రాష్ర్టాలు అతిపెద్ద ఆధ్యాత్మిక‌ క్ర‌తువులో భాగం పంచుకుంటున్నాయి. సుమారు 400 ట‌న్నుల భారీ మ‌హావిగ్ర‌హాన్ని సుర‌క్షితంగా త‌ర‌లిచేందుకు 60 రోజుల ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసుకొని ఇరు రాష్ర్టాల‌కు చెందిన పోలీసులు - అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కేంద్ర‌ - రాష్ట్ర ప్ర‌భుత్వాల అనుమ‌తులు సైతం తీసుకున్నారు. బెంగళూరులోని ఈజీపురలో 60 ఏళ్ల క్రితం నిర్మించిన శ్రీకోదండరామస్వామి ఆలయంలో ప్రతిష్ఠించేందుకు సిద్ధం చేసిన విశ్వరూప మహా విష్ణువు విగ్రహ తరలింపునకు సంబంధించిన‌ది ఈ ప్ర‌క్రియ‌.

అతిపెద్ద విశ్వ‌రూప మ‌హావిష్ణువు విగ్ర‌హాన్ని త‌మ ఆల‌యంలో ప్ర‌తిష్టించాల‌ని సంక‌ల్పించిన శ్రీ కోదండరామస్వామి దేవాల‌య ప్ర‌తినిధులు ఇందుకు స‌రిపోగ‌ల రాయి కోసం పెద్ద ఎత్తున అన్వేష‌ణ జ‌రిపారు. ఈ క్ర‌మంలో వారికి తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లా వందవాసి సమీపంలోని కొరకోట గ్రామంలో అనువైన రాయి దొరికింది. అత్యాధునిక పరికరాలను ఉపయోగించి 400టన్నుల బరువైన రాతిని కత్తిరించి విశ్వరూప శ్రీమహావిష్ణువు విగ్రహం చెక్కేందుకు నిర్ణయించారు. ఈ క్ర‌మంలో దాదాపు మూడేళ్ల పాటు సాగిన క్రతువు తాజాగా ముగిసింది. 64 అడుగుల ఎత్తు, 26 అడుగుల వెడల్పున 11 ముఖాలు, 22 చేతులున్న విశ్వరూప శ్రీమహావిష్ణు విగ్రహం రూపొందించారు. మహా విష్ణువు విగ్రహానికి పీఠభాగంగా 24 అడుగుల పొడవు - 30 అడుగుల వెడల్పుతో ఏడు తలలున్న ఆదిశేష విగ్రహాన్ని కూడా సిద్ధం చేశారు. పీఠంతో కలిపి ఈ విగ్రహం ఎత్తు 108 అడుగులు ఉండనుంది. ఇంత అతి భారీ విగ్ర‌హాన్ని హోసూరు నుంచి ఈజీపుర‌కు త‌ర‌లించేందుకు సిద్ధ‌మై అందుకు త‌గిన రీతిలో ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశారు.

ఈజీపుర‌కు ఇంత భారీ రూపాన్ని త‌ర‌లించేందుకు 160 చక్రాలున్న భారీ వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. ఇంత భారీ వాహ‌నం ఏర్పాటు చేసిన‌ప్ప‌టికీ గ‌మ్య‌స్థానం చేరుకునేందుకు 60 రోజులు ప‌డుతుంద‌ని స‌మాచారం. ఎందుకంటే స‌క‌ల జాగ్ర‌త్త‌లతో త‌ర‌లింపును చేప‌డుతున్నారు. రోజుకు 5 కిలోమీట‌ర్లు అందులోనూ రాత్రివేళ‌ల్లో మాత్ర‌మే ప్ర‌యాణించేలా ఏర్పాటు చేశారు. కాగా మ‌హావిష్ణువును ద‌ర్శించుకునేందుకు, స్వాగ‌తం ప‌లికేందుకు ఈ రెండు రాష్ర్టాల్లోని ప్ర‌జ‌లు సిద్ధం అవుతున్నారు. మ‌రోవైపు విగ్ర‌హం ఆల‌యానికి చేరిన అనంత‌రం 400 టన్నుల బరువున్న మహావిష్ణు విగ్రహానికి 230 టన్నుల బరువైన ఆదిశేష విగ్రహాన్ని బెంగళూరులోని ఆలయంలో కళాకారులు అమర్చనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/