Begin typing your search above and press return to search.

పోలీసులు మారారు..బడాబాబును లోపలేశారు..

By:  Tupaki Desk   |   18 Jun 2018 7:55 AM GMT
పోలీసులు మారారు..బడాబాబును లోపలేశారు..
X
ఓటుకు నోటు లాంటి రాష్ట్రాన్ని షేక్ చేసే కేసే అతీగతం లేకుండా పోయింది. ఇక సాధారణ కేసులు ఓ లెక్క అంటారా.? నిజమే ఎప్పటినుంచో పోలీసులు డబ్బున్న వాళ్లు, ప్రజాప్రతినిధుల చేతిలో కీలుబొమ్మలు అనే ప్రచారం ఉంది. డబ్బులు వెదజల్లితే ఎంత నేరమైనా కాంప్రమైజ్ చేస్తారని సమాజంలో పేరుకుపోయింది. పోలీస్ స్టేషన్ గడప తొక్కడానికే సామాన్యులు భయపడే పరిస్థితి చాలా కాలంగా ఉండేది. అప్పటికి ఇప్పటికీ కొద్దిలో కొద్దిగా మార్పు వచ్చింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ కు ప్రాధాన్యం పెరిగింది.

తెలంగాణ సీఎం కేసీఆర్ గద్దెనెక్కాక పోలీస్ సంస్కరణలు చేశారు. వారికి వాహనాలు - అత్యాధునిక వసతులు సమకూర్చారు. పోలీసులకు ఫుల్ పవర్ కూడా ఇచ్చారు. దీంతో కొద్దిలో కొద్దిగా మార్పు వచ్చింది. మునుపటిలా పోలీసులు ప్రతి విషయంలో బెండ్ కావడం లేదు..ఇందుకు తాజాగా జరిగిన ఓ సంఘటన పోలీసుల తీరును కళ్లకు కట్టింది.

ఈరోజు ఉదయం 6.30 గంటల సమయం అప్పుడు ఫుల్ గా తాగి ఉన్న సిద్ధార్థ రెడ్డి అనే బడాబాబు కారులో మాదాపూర్ నుంచి వెళుతుండగా స్కూలు బస్సును ఢీకొట్టాడు. తప్పు అతడిదే అయినా బస్సు డ్రైవర్ పై చేయిచేసుకున్నాడు. బస్సు తాళాలు లాగేసుకొని గొడవ చేస్తున్నాడు. అక్కడికి వచ్చిన హోంగార్డు గోపాల్ సిద్ధార్థరెడ్డిని అడ్డుకున్నాడు. దీంతో హోంగార్డ్ పై కూడా పిడిగుద్దులు గుద్దాడు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఈ మందుబాబును స్టేషన్ తరలించారు. బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేస్తే 160 పాయింట్లు సూచించింది.

అయితే స్టేషన్ కు వెళ్లగానే ఎస్.ఐ - ఇతర పోలీసులను కూడా సిద్ధార్థ్ రెడ్డి బండబూతులు తిట్టాడు. చేయిచేసుకున్నాడు. దీంతో పోలీసులు అతడిని లాకెప్ లో వేశారు. ఇతడు ఎవరని ఆరాతీయగా నగరంలో ఉన్న ఓ ప్రముఖ హాస్పిటర్ చైర్మన్ మనవడని తేలింది. అప్పటికే ఈ బడాబాబుకు మద్దతుగా వ్యక్తులు రంగంలోకి దిగారు. పోలీసులతో రాజీ కోసం తీవ్ర చర్చలు జరిపారు. కానీ దెబ్బలు తిన్న హోంగార్డు, బస్సు డ్రైవర్ పోలీసులు రాజీకి ఒప్పుకోలేదు.. ‘ఇలా ఎంతకాలం మేము ఇలాంటి వారి చేతిలో తన్నులు తినాలి.? ఎంతకాలం మా ఆత్మాభిమానాన్ని చంపుకొని ఉద్యోగాలు చేయాలి.?’’ అని పోలీసులు అతడిని విడుదల చేయడానికి నో చెప్పారు. ఎట్టకేలకు హోంగార్డు, బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు నిందితుడు సిద్ధార్థ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

ఇలా ఎంత ఒత్తిడి వచ్చినా ఓ బడాబాబును కటకటాలకు పంపి పోలీసులు తమ నిజాయితీని చాటుకున్నారు. అన్ని రోజులు ఒకలా ఉండవని.. తమలోనూ మార్పు వచ్చిందని చాటిచెప్పారు.